త్వరలో పత్రిక, వెబ్ సైట్: కోదండరామ్

November 15, 2016


img

తెలంగాణా రాజకీయ జేయేసి చైర్మన్ ప్రొఫెసర్  కోదండరామ్ ఈరోజు ఒక సంచలనమైన విషయం చెప్పారు. ఈ నెలాఖరులోగా జేయేసి అధికారిక వెబ్ సైట్ ని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఆ తరువాత ఒక పత్రికని కూడా ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వివిధ అంశాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలలో లోటుపాట్లని వాటిలో చర్చించి, వాటి పరిష్కారం కోసం ప్రజల మద్దతు కూడగడతామని ప్రొఫెసర్  కోదండరామ్ చెప్పారు. ఇప్పటికే వివిధ సమస్యలపై చర్చించేందుకు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు పత్రిక, వెబ్ సైట్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణా ప్రజలతో అభిప్రాయాలు పంచుకొనే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. 

ప్రొఫెసర్  కోదండరామ్ ఒకవేళ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి ఉంటే అది ఎంత సంచలనం కలిగించేదో ఇదీ ఇంచుమించు అంతే సంచలనం కలిగించే విషయమేనని చెప్పవచ్చు. ప్రజా సమస్యలపై ఇంతవరకు ఆయన చేస్తున్న పోరాటాల గురించి మీడియా చెపితేనే అందరికీ తెలిసేది లేకుంటే లేదు. కానీ ఇప్పుడు స్వంత పత్రిక, వెబ్ సైట్ ఏర్పాటు చేసుకొంటున్నారు కనుక రాష్ట్రంలో ఉన్న ప్రజలకే కాక దేశవిదేశాలలో ఉన్నవారికి కూడా రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం చేయవలసిన కృషి గురించి తెలుస్తుంది. ఇది తెరాస సర్కార్ కి చాలా ఇబ్బంది కలిగించే విషయమేనని చెప్పవచ్చు. ఇప్పటికే ఆయనపై మండిపడుతున్న తెరాస సర్కార్ దీనిపై ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.     



Related Post