నోట్ల రద్దుతో మొదటి పాజిటివ్ ఎఫెక్ట్

November 15, 2016


img

నోట్ల రద్దుతో సామాన్య ప్రజలే కాదు...కాశ్మీర్ లో వేర్పాటువాదులు కూడా చాలా ఇబ్బందులు పడుతునారుట! ఈ విషయం రక్షణమంత్రి మనోహర్ పారిక్కర్ స్వయంగా చెప్పారు. ఇదివరకు కాశ్మీర్ లో నిత్యం అల్లర్లు జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు అవి బాగా తగ్గిపోయాయి. కానీ ఆ క్రెడిట్ భద్రతాదళాలలకి చెందదు. ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుంది! మూడు నెలలపాటు భద్రతాదళాలు ఎంత ప్రయత్నించినా సాద్యంకాని పనిని నరేంద్ర మోడీ డిల్లీ లో కూర్చొని చక్క బెట్టేశారు. దటీజ్ మోడీ! 

నోట్ల రద్దు నిర్ణయంతో కాశ్మీర్ లో వేర్పాటువాదుల చేతులు కట్టి పడేసినట్లు అయ్యింది. ఇదివరకు అల్లరి మూకలకి పోలీసులపై రాళ్ళూ రువ్వడానికి మనిషికి రూ.500, 1000 చొప్పున చెల్లించేవారు. ఇప్పుడు ఆ నోట్లు ఎందుకు పనికిరాకుండా పోవడంతో అల్లరి మూకలకి చెల్లింపులు నిలిచిపోయాయి. దానితో కాశ్మీర్ లో అల్లర్లు కూడా నిలిచిపోయాయి. ప్రభుత్వ పాఠశాలలకి నిప్పు పెట్టడం కూడా ఆగిపోయింది. నోట్ల రద్దుతో వేర్పాటువాదులని, ఉగ్రవాదులని, మావోయిష్టులని కట్టడి చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటలు అక్షరాల నిజమయ్యాయి. మిగిలిన విషయాలలో కూడా అయన చెప్పినవి నిజమవుతాయి. కనుక దేశంలో రాజకీయ పార్టీలు చెపుతున్న మాటలని పట్టించుకోనవసరం లేదు. 

ప్రధాని నరేంద్ర మోడీ పాత నోట్లని ఎందుకు రద్దు చేశారో, దాని వలన దేశానికి ఏమేమి లాభాలు కలుగుతాయో స్పష్టంగా చెపుతున్నారు. కానీ ఆయన నిర్ణయాన్ని తప్పని వాదిస్తున్న ప్రతిపక్షాలు అది ఎందుకు తప్పో చెప్పలేకపోతున్నాయి. విదేశాలలో ఉన్న నల్లధనం వెనక్కి రప్పించలేకనే మోడీ ఈ ఎత్తుగడ వేశారని వితందవాదన కూడా చేస్తున్నాయి. కానీ విదేశాల నుంచి నల్లధనం వెనక్కి రప్పించలేకపోయినా ప్రజలెవరూ పెద్దగా పట్టించుకోవడం లేదనే సంగతి అందరికీ తెలుసు. కనుక ప్రతిపక్షాలు వాదన అర్ధరహితమే. ఆ కారణం చేత ప్రధాని నరేంద్ర మోడీ ఇంత పెద్ద రిస్క్ తీసుకోనవసరం లేదని అర్ధం అవుతోంది. కనుక మోడీ చెపుతున్న కారణాలే నిజమని అర్ధం అవుతోంది. దానికి మొదటి ఉదాహరణ కాశ్మీర్ లో మారిన పరిస్థితులే. 

నోట్ల రద్దు కారణంగా తాత్కాలికంగా ఇబ్బందులు పడుతున్న దేశ ప్రజలందరూ మరికొన్ని రోజులు ఓర్చుకోగలిగితే పరిస్థితులు ఇంకా వేగంగా చక్కబడతాయి. దేశహితం కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ఈ ప్రయత్నానికి సహకరించకుండా, ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రజల పేరు చెప్పి నీచమైన రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలకి ఆ ప్రజలే బుద్ధి చెప్పడం కూడా చాలా అవసరమే అని అందరూ గుర్తుంచుకోవాలి.


Related Post