గాలివారి పెళ్ళికి వెళ్ళనంత మాత్రాన్న..

November 15, 2016


img

గాలి జనార్ధన రెడ్డి పేరు చెపితే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది అతని అక్రమ గనుల త్రవ్వకాలు..దానితో అతను సంపాదించిన అక్రమాస్తులు..వాటితో అతని విలాసవంతమైన జీవితమే. కానీ డబ్బుకి లోకం దాసోహం అని ఎప్పుడో ఓ కవి చెప్పినట్లుగా జనం నవ్వితే నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు ఎగ్గు..ఆ డబ్బు వాసన గాలి కొంచెం తగిలితే చాలనుకొనే రాజకీయ నాయకులు, సినిమా నటులు, ప్రముఖులు కోకొల్లలున్నారు. రేపు బెంగళూరులో గాలి కూతురు పెళ్ళి జరుగబోతోంది. ఆ పెళ్ళి ఆహ్వాన పత్రికని వీడియో స్క్రీన్స్ రూపంలో పంచిపెట్టి దేశంలో ఒక సంచలనం సృష్టించాడు గాలి. ఆహ్వానపత్రికకే అంత ఖర్చు పెడితే పెళ్ళికి ఇంకెంత ఖర్చు పెట్టబోతున్నాడో...?అని అందరూ లెక్కలు కట్టే ప్రయత్నాలు చేశారు. వారికి ఆ శ్రమ లేకుండా సుమారు రూ.400-500 కోట్లు గాలి ఖర్చులు ఉందవచ్చని మీడియానే లెక్క కట్టి చెప్పింది. 

పెద్ద నోట్ల రద్దుతో గాలి పరిస్థితి ఏమిటని చాలామంది ఆందోళన చెందారు. కానీ నల్లకుభేరులకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నామని చెపుతున్న మోడీ ప్రభుత్వం ఆశీస్సులు గాలికి పుష్కలంగా ఉన్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. బహుశః అందుకేనేమో నోట్ల రద్దు కారణంగా గాలివారింట నుంచి ఎటువంటి గాలి కబుర్లు వినబడలేదు. యధాప్రకారం రేపటి పెళ్ళికి అట్టహాసంగా అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. కనుక ‘ఆశీస్సులున్న మాట నిజమే అని మరో టాక్ గట్టిగా వినిపిస్తోంది. 

దేశంలో ఎటువంటి గాలి వీస్తున్నప్పటికీ, రేపు చాలా అట్టహాసంగా పెళ్ళి జరుగడం నిశ్చయమే. ఇప్పటికే దేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులకి, సినీ ప్రముఖులకి డిజిటల్ వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అందాయి. కనుక వారిలో ఎంతమంది ఈ పెళ్ళికి హాజరవుతారో చూడాలి. అటువంటి అవినీతిపరులు, నల్లకుభేరుల భరతం పట్టడానికే పాత నోట్లు రద్దు చేశామని ప్రధాని నరేంద్ర మోడీ గొంతు చించుకొని చెపుతున్నారు కనుక ఈ సమయంలో గాలివారి పెళ్ళి భోజనాలకి, ఆయన ఇవ్వబోయే ఖరీదైన బహుమానలకి ఆశపడి వెళ్ళవద్దని భాజపా నేతలకి డిల్లీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తాజా సమాచారం. ఆ గాలి సోకితేనే అపవిత్రం అయిపోతామన్నట్లు భాజపా అధిష్టానం భయపడటం చా విచిత్రంగానే ఉంది. అదే నిజమయితే మరి అతనిని ఎందుకు జైలులో నుంచి ఒడ్డున పడేసినట్లు? ఈ పెళ్ళికి వెళ్ళనంత మాత్రాన్న భాజపాకి ఆ గాలితో సంబంధం లేకుండా పోతుందా? రేపు పెళ్ళికి వెళ్ళకపోయినా వచ్చే ఎన్నికలలో ఆ గాలి పీల్చకుండానే భాజపా ఆ గండం గట్టెక్కగలరా? అయిన అవినీతికి ప్రతిరూపం వంటి చెట్టంత ఎడ్యూరప్పకి పార్టీ పగ్గాలు అప్పగించిన తరువాత ఇంకా ఈ ‘మడి’ ఎందుకు?


Related Post