అందుకే నోట్ల రద్దు?

November 14, 2016


img

మోడీ సర్కార్ నోట్ల రద్దుకి అనేక కారణాలు చెపుతోంది. కానీ అది చెప్పని మరో కారణం కూడా కనిపిస్తోంది. అదే...వచ్చే ఏడాది 5 రాష్ట్రాలలో జరుగబోయే ఎన్నికలు.వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో మొదట ఎన్నికలు జరుగబోతున్నాయి. వీలైతే గుజరాత్, గోవా, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికలని కూడా వాటితో కలిపి నిర్వహించాలని కేంద్రప్రభుత్వం ఎన్నికల కమీషన్ని కోరింది. దానిపై ఇంకా ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవలసి ఉంది. గుజరాత్, గోవా రాష్ట్రాలలో ప్రస్తుతం భాజపాయే అధికారంలో ఉంది కనుక ఆ రెండు రాష్ట్రాలలో కూడా యూపి, పంజాబ్ రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు నిర్వహించడానికి ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. కనుక కనీసం నాలుగు రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. గుజరాత్, గోవా ఎన్నికల సంగతి పక్కనబెడితే యూపి, పంజాబ్ రాష్ట్రాలలో మాత్రం మార్చిలోగా ఎన్నికలు నిర్వహించడం ఖాయమే. 

వాటిలో యూపి ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకి చాలా ముఖ్యమైనవే. ఎన్నికలంటేనే కోట్లు రూపాయలు నీళ్ళలా ఖర్చుపెట్టాల్సి ఉంటుందని అందరికీ తెలుసు. అందుకు యూపిలో రాజకీయ నాయకులు, పార్టీలు అందరూ సిద్దంగానే ఉన్నారు. కానీ వారందరికీ ప్రధాని నరేంద్ర మోడీ నోట్లు రద్దుతో ఊహించని దెబ్బ కొట్టేశారు. అందుకే యూపిలో ములాయం సింగ్ యాదవ్, మాయావతి, పంజాబ్ ఎన్నికలలో విజయావకాశాలున్న ఆమాద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారని చెప్పవచ్చు. సరిగ్గా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కేంద్రప్రభుత్వం పాత నోట్లని రద్దు చేయడంతో వారి వద్ద ఉన్న డబ్బు ఎందుకూ పనికిరాకుండాపోవడమే కాకుండా, ఎన్నికల సమయంలో వారివద్ద చేతిలో డబ్బు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. మోడీ ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకొంది కనుక, భాజపా దాని మిత్రపక్షాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకొనే ఉంటాయి కనుక వాటికి డబ్బుకి ఇబ్బంది ఉండకపోవచ్చు. కనుక ఈ ఎన్నికలని ఎదుర్కోవడానికి వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఒకవేళ నాలుగు రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించినట్లయితే ఈ నోట్ల రద్దు కారణంగా ఆ నాలుగు రాష్ట్రాలలో భాజపా అధికారంలోకి వచ్చే అవకాశాలు పెరుగవచ్చు. 


Related Post