ప్రధాని నరేంద్ర మోడీకి బెదిరింపులా?

November 14, 2016


img

ప్రధాని నరేంద్ర మోడీ నిన్న గోవాలో చేసిన ప్రసంగంలో నోట్ల రద్దు గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక దిగ్బ్రాంతి కలిగించే విషయం చెప్పారు. నోట్లరద్దు నిర్ణయం వలన దేశంలో నల్లకుభేరులకి ఊహించని దెబ్బ తగిలిందని కనుక వారందరూ తనని శత్రువుగా భావిస్తున్నారని అన్నారు. ఆ కారణంగా తన ప్రాణానికి కూడా ప్రమాదం ఉందని తెలుసని అన్నారు. కానీ తాను ప్రాణాలకి తెగించే ఈ నిర్ణయం తీసుకొన్నానని కనుక దేశం కోసం తన ప్రాణాలు పోగొట్టుకొన్నా పరువాలేదని అన్నారు. తాను ప్రధానమంత్రి పదవి కోసం ఆరాటపడటం లేదని, గత 7దశాబ్దాలుగా పీడనకి, దోపిడీకి గురవుతున్న భారతదేశానికి వాటి నుంచి విముక్తి కల్పించడానికే ఆలోచిస్తున్నానని చెప్పారు. ‘ఇంతవరకు దేశాన్ని పాలించినవారికి 70 సం.ల సమయం ఇచ్చారు నాకు కేవలం 70 నెలలు సమయం ఇస్తే చాలు దేశం ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని’ చెప్పారు. 

నల్లధనంపై పోరాటం మొదలుపెట్టాలని అనుకొన్నప్పుడే తాను దేశంలో ఎంత బలమైన శక్తులని ఎదుర్కోబోతున్నానో తెలుసని అయినా ధైర్యంగా ముందడు వేశానని కనుక ప్రాణాలకి భయపడి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పారు. తను అధికారంలోకి రాగానే నల్లధనం ఉన్నవారిపై చర్యలు తీసుకొంటానని హెచ్చరించి, ఆ తరువాతే పని మొదలుపెట్టానని అదేమీ రహస్యంగా చేయలేదన్నారు. ఈ రెండున్నరేళ్ళలో నల్లధనం ఉన్నవారికి తను చాలా అవకాశాలే ఇచ్చానని కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకొన్నారని మోడీ అన్నారు.

డిశంబర్ 31వ తేదీ తరువాత నుంచి అవినీతిపరులు, నల్లకుభేరుల భరతంపడతానని దాని కోసం తన మెదడులో ఇంకా అనేక వ్యూహాలు సిద్దంగా ఉన్నాయని చెప్పారు. అవసరమైతే ఈ మహాయజ్ఞం కోసం లక్షమందిని నియమించుకొంటానని మోడీ అన్నారు. విదేశాలలో దాచిన నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు కూడా తన ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోందని అవి కొంతవరకు సఫలం అవుతున్నాయని త్వరలో ఆ పని కూడా పూర్తి చేసి చూపిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 

ఈ నోట్ల రద్దుతో దేశంలో అవినీతిపరులు, నల్లధనం దాచుకొన్నవారే నష్టపోతున్నారు తప్ప సామాన్య ప్రజలు కాదని వారి కష్టపడి సంపాదించుకొన్న ప్రతీ పైసా కూడా వారికే దక్కుతుందని ఈ నోట్ల రద్దు కారణంగా దానిలో ఒక్కపైసా కూడా నష్టపోరని మోడీ చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంలో దేశవిదేశాలలో చాలా బారీగా నల్లధనం పోగేసుకొన్నవారు అందరూ తనని అడ్డుతొలగించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పడం చాలా ఆందోళనకరమైన విషయమే. ఈ రెండున్నరేళ్ళలో ప్రధాని నరేంద్ర మోడీ నోట ఎన్నడూ ఇటువంటి మాట వినలేదు. మొట్టమొదటిసారిగా తన ప్రాణాలకి ప్రమాదం ఉందని చెపుతున్నారు.

మోడీ తీసుకొన్న ఈ సాహసోపేతమైన నిర్ణయం వలన దేశంలో చాలా మంది కోటీశ్వరులు, నల్లకుభేరుల ఆర్ధిక పరిస్థితులు తారుమారు అయ్యే ప్రమాదం ఏర్పడింది కనుక అటువంటివారు తమ సంపదని కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగించే ప్రమాదం ఉంది. పాక్ పై సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత ప్రధాని నరేంద్ర మోడీకి ఉగ్రవాదుల నుంచి చాలా ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు వారికి దేశంలో నల్లకుభేరులు కూడా తోడయినట్లు భావించవచ్చు. అయితే అది అనుకొన్నంత తేలిక కాదు కానీ తనకి ప్రమాదం ఉందనే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెప్పారు కనుక నమ్మి తీరాల్సిందే. కనుక ఆయన మరింత కట్టుదిట్టమైన భద్రత చాలా అవసరం ఉంది.


Related Post