నోట్ల రద్దుతో తెలంగాణాకి మాత్రమే నష్టమా?

November 12, 2016


img

నోట్ల రద్దు కారణంగా తెలంగాణా ప్రభుత్వానికి నెలకి రూ.2,000 కోట్లు ఆదాయం కోల్పోతోందని, దాని వలన రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి తారుమారు అవుతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేంద్రప్రభుత్వం నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు కానీ గవర్నర్ నరసింహన్ న్ని కలిసి ఈ నిర్ణయం వలన రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యల గురించి మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. కేంద్రప్రభుత్వం నిర్ణయం పట్ల కేసీఆర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

వాటిపై మంత్రి కేటిఆర్ స్పందిస్తూ “దేశహితం కోసం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొన్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ ఆ నిర్ణయం వలన ఎదురవుతున్న సమస్యల గురించే మేము కొంచెం బాధ పడుతున్నాము. దీని వలన రాష్ట్రంపై తాత్కాలిక, దీర్గకాలిక ప్రభావం ఏవిధంగా ఉండబోతోందనే విషయం పరిశీలిస్తున్నాము. ఈ నిర్ణయం వలన రాష్ట్రానికి నెలకి సుమారు రూ.2,000 కోట్లు ఆదాయం నష్టపోతున్న మాట వాస్తవం. ఇప్పటికే ఈ సమస్య తీవ్రతని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకొనే ప్రయత్నంలో భాగంగానే అడ్వాన్స్ గా ఆస్తి పన్నులు స్వీకరించడం మొదలుపెట్టాము. ఇంకా ఇటువంటి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాము,” అని మంత్రి కేటిఆర్ చెప్పారు. 

దేశంలో రెండవ ధనిక రాష్ట్రం మనది అని గొప్పగా చెప్పుకొనే తెలంగాణా సర్కార్ కేంద్రప్రభుత్వం నిర్ణయంతో ఆర్ధిక ఇబ్బందులలో పడ్డామని చెప్పుకొంటుంటే, రాష్ట్ర విభజన కారణంగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో చిక్కుకొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు ఆ ప్రభావం ఏమీ లేనట్లుగా వ్యవహరిస్తుండటం విశేషం. ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రకటన చేయగానే అందరి కంటే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు. పైగా గవర్నర్ దగగారకి వెళ్ళి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి మోర పెట్టుకొన్నారు. 

ఇది చూస్తే కేంద్రప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం వలన దేశంలో కేవలం తెలంగాణా రాష్ట్రం మాత్రమే ఆదాయం కోల్పోతోందా? మిగిలిన రాష్ట్రాలకి ఇటువంటి సమస్యలు లేవా?అనే అనుమానం కలుగుతోంది. కేంద్రప్రభుత్వం నిర్ణయం వలన దేశంలో అన్ని రాష్ట్రాలలో అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడిన మాట వాస్తవం. కానీ దేశహితం కోసం తీసుకొన్న ఈ నిర్ణయం వలన దేశప్రజలు అందరూ..అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు  కొన్ని చిన్నపెద్దా ఒడిదుడుకులని ఎదుర్కొనక తప్పదు. ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దానిని ధైర్యంగా ఎదుర్కొంటున్నప్పుడు దేశంలో 2వ ధనిక రాష్ట్రమైన తెలంగాణా ఎందుకు ఎదుర్కోలేదు? అని ఆలోచిస్తే బాగుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ధైర్యం చెప్పవలసిన పాలకులే కన్నీళ్ళు పెట్టుకొంటే సామాన్య ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని గ్రహించాలి.    



Related Post