ప్రజలకి లేని అభ్యంతరం ప్రతిపక్షాలకి ఎందుకు?

November 11, 2016


img

ఇదివరకు సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించినప్పుడు, ప్రపంచదేశాలన్నీ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని, ధైర్యసాహసాలని మెచ్చుకొంటుంటే దేశంలోని కాంగ్రెస్ తో సహా అనేక పార్టీలు ఆయనని విమర్శించాయి. మళ్ళీ ఇప్పుడు పెద్ద నోట్లని రద్దు చేసినందుకు, ప్రపంచ దేశాలతో సహా భారత్ ని తీవ్రంగా ద్వేషించే పాకిస్తాన్ మీడియా, పాకిస్తాన్ పాలకులు, ప్రతిపక్షాలు అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమాద్మీ, సమాజ్ వాదీ బహుజన్ సమాజ్ వాదీ వంటి కొన్ని పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. వాటన్నిటికీ భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు చాలా గట్టిగా, ఘాటుగా సమాధానం ఇచ్చారు. 

ఆయన డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “మా ప్రభుత్వం నల్లధనం అరికట్టలేదేమని నిత్యం విమర్శించే కాంగ్రెస్, ఆమాద్మీ తదితర పార్టీలు ఇప్పుడు మేము దానికోసం గట్టి చర్యలు తీసుకొంటే ఎందుకు విమర్శిస్తున్నాయి. వాటికి నిజంగా నల్లధనం అరికట్టాలని ఉందా లేదా? ఉన్నట్లయితే మా చర్యలని సమర్ధించాలి కానీ విమర్శిస్తున్నాయి. తద్వారా వాటి వైఖరి ఏమిటో అవే బయటపెట్టుకొన్నాయి. దేశంలో నల్లధనం కొనసాగాలని ప్రతిపక్షాలు కోరుకొంటున్నాయని భావించవలసి వస్తోంది.

మేము తీసుకొన్న ఈ చర్య ద్వారా దేశంలో సామాన్య ప్రజలకి, నిజాయితీగా వ్యాపారాలు చేసుకొనే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కేవలం ఉగ్రవాదులకి, మావోయిష్టులకి, వేర్పాటువాదులకి నిధులు ఆగిపోతాయి. నల్లధనం దాచుకొన్నవారికి, వినియోగిస్తున్నవారికి, నకిలీ కరెన్సీని తయారుచేసేవారికి కోలుకోలేని దెబ్బ తగులుతుంది కనుక వారి బాధని నేను అర్ధం చేసుకోగలను. కానీ దేశహితం కోసం ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? దేశంలో నల్లధనం ఎప్పటికీ కొనసాగాలని కోరుకొంటున్నాయా? వారు తమ వైఖరిని తెలియజేయాలని నేను కోరుతున్నాను,” అని అమిత్ షా అన్నారు. 

కేంద్రప్రభుత్వం చర్యని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు దాని వలన సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వాదిస్తున్నాయి. కానీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో సామాన్య ప్రజలు దీని వలన తమకి కొంతః ఇబ్బంది కలిగినా, దేశం కోసం ఆ మాత్రం భరించగలమని చెపుతుండటం టీవీలలో చూడవచ్చు. ప్రజలు కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే, ప్రతిపక్షాలు వారి పేరు చెప్పుకొని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? అంటే వారి వద్ద బారీగా నల్లధనం ఉన్నందునే అని అనుమానించక తప్పదు. అమిత్ షా నేరుగా ఆవిధంగా ఆరోపించనప్పటికీ, ఆయన మాటలకి అర్ధం అదేనని భావించవచ్చు.  



Related Post