లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించి షాక్ ఇవ్వగా, జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్‌ని రద్దు చేయాలంటూ కేసీఆర్ వేసిన పిటిషన్‌ను ఇక్కడ తెలంగాణ హైకోర్టు కొట్టిపడేసింది. ఒకే రోజున తండ్రీ, కూతుర్లకు వేర్వేరు హైకోర్టులలో ఎదురుదెబ్బలు యాదృచ్చికమే అయినా కల్వకుంట్ల కుటుంబానికి. బిఆర్ఎస్ పార్టీకి ఇవి తీవ్ర నిరాశ కలిగించేవే.
కేసీఆర్ హయాంలో ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్‌కు విచారణ జరిపే అర్హతే లేదని, కనుక ఆ పదవి నుంచి తప్పుకోవాలంటూ కేసీఆర్ కమీషన్‌కు లేఖ వ్రాషారు. ఆ తర్వాత దానిని రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. తద్వారా ఈ వ్యవహారంలో తనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమీ చేయలేదని కేసీఆర్ బిఆర్ఎస్ శ్రేణులకు ధైర్యం కల్పించే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు.
కానీ ఇప్పుడు హైకోర్టు కేసీఆర్ అభ్యంతరాలు అర్ధరహితమంటూ ఆయన వేసిన పిటిషన్‌ని కొట్టివేయడమే కాకుండా విచారణ కొనసాగించేందుకు కమీషన్‌కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. మరో రెండు నెలల్లో రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు జరుగబోతున్నాయంటూ కేసీఆర్ చెప్పుకుంటున్నారు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుంచి కూతురు కల్వకుంట్ల కవితకి బెయిల్ కూడా సంపాదించుకోలేకపోతున్నారు.
కనుక ఢిల్లీ, తెలంగాణ హైకోర్టులలో జరిగిన ఈ రెండు పరిణామాలు కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీకి పరిస్థితులు చాలా వ్యతిరేకంగానే ఉన్నాయని సూచిస్తున్నాయి. కనుక బిఆర్ఎస్ శ్రేణులు మరింత నిరుత్సాహానికి గురవడం సహజం. కనుక మరింత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లిపోయే అవకాశాలు కనబడుతున్నాయి.
ఈ పరిణామాలు కేసీఆర్ కుటుంబానికి, బిఆర్ఎస్ పార్టీకి కూడా చాలా ఆందోళన కలిగించేవే అని భావించవచ్చు. మరి వీటి నుంచి కేసీఆర్ ఏవిదంగా బయటపడతారో చూడాలి.