ఇప్పుడు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షాలను వేధించడం, కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిపోయింది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టగా, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్, బిఆర్ఎస్ నేతలపై అదేవిదంగా రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి విచారణ జరిపించి కేసులు సిద్దం చేస్తోంది.
గత 5 ఏళ్ళుగా ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుని, టిడిపి నేతలను చాలా చాలా వేధించారు. ఆ వేధింపుల నుంచే ఎర్ర డైరీ పుట్టింది. టిడిపి యువనాయకుడు, ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారా లోకేష్, తమని వేధిస్తున్న వైసీపి నేతలు, అధికారుల వివరాలను ఎర్ర డైరీలో వ్రాసుకునేవారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డైరీలో పేర్లున్న ప్రతీ ఒక్కరిపై కటిన చర్యలు ఉంటాయని నారా లోకేష్ పదేపదే హెచ్చరించేవారు. ఇప్పుడు ఏపీలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి నారా లోకేష్ మంత్రి అయ్యారు కూడా. కనుక ఎర్ర డైరీ బయటకు తీసారు. దానిలో పేర్లున్న వైసీపి నేతలు, అధికారులు ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఆ ఎర్ర డైరీ స్పూర్తితో ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ‘నల్ల డైరీ’లో తమని వేధిస్తున్న, అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ మంత్రులు, నేతలు, అధికారుల పేర్లు నమోదు చేయడం ప్రారంభించారు.
ఈరోజు ఆయన మీడియా సమక్షంలో ఆ డైరీలో మొట్ట మొదట మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ పేరుని వ్రాసి చూపారు. ఫ్లై యాష్ తరలింపులో మంత్రి పొన్నం ప్రభాకర్ భారీగా అవినీతికి పాల్పడుతున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కనుక మళ్ళీ రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే మొట్ట మొదట ఈ కేసులో మంత్రి పొన్నం ప్రభాకర్‌పై చర్యలు తీసుకుంటామని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.
అధికారంలో ఉన్నవారు ఎలాగూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో దురుసుగా వ్యవహరిస్తూనే ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా ఇలా డైరీలు చూపిస్తూ బెదిరిస్తుంటే, ఇక ఏ అధికారి నిష్పక్షపాతంగా, నిర్భయంగా పనిచేయగలరు?