డెప్యూటీ స్పీకర్‌ పదవికి ఇంత పంతం అవసరమా?

June 26, 2024


img

సాధారణంగా లోక్‌సభ స్పీకర్‌గా అధికార పార్టీ సభ్యుడే ఉంటారు. అయినప్పటికీ స్పీకర్‌ని అధికార, ప్రతిపక్ష సభ్యులు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఈసారి కూడా ఓం బిర్లాని స్పీకర్‌గా ఎన్నుకోవడానికి ఇండియా కూటమి సంసిద్దత వ్యక్తం చేసింది.

కానీ ఆనవాయితీ ప్రకారం డెప్యూటీ స్పీకర్ పదవిని తమకు ఇవ్వాలని కోరింది. కానీ అందుకు మోడీ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఇండియా కూటమి కూడా లోక్‌సభ స్పీకర్‌ పదవికి తమ అభ్యర్ధిగా కేరళకు చెందిన కె. సురేష్‌ని బరిలో దింపింది. 

మోడీ ప్రభుత్వం ఇండియా కూటమికి డెప్యూటీ స్పీకర్‌ పదవి కేటాయించి ఉండి ఉంటే అసలు ఈ పోటీయే ఉండేది కాదు. కానీ మోడీ ప్రభుత్వం పంతానికి పోవడంతో ఈ సమస్య ఉత్పన్నం అయ్యింది.

ఈసారి ఎన్నికలలో ఎన్డీయేకి 370-400 సీట్లు వస్తాయనుకుంటే 293 మాత్రమే రావడం, ఇండియా కూటమికి 233 సీట్లు రావడం బహుశః మోడీ ప్రభుత్వం జీర్ణించుకోలేకనే పార్లమెంట్‌ వేదికగా తమకు తిరుగులేదని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ఈవిదంగా చేస్తుండవచ్చు.

లోక్‌సభలో ఎన్డీయే కూటమికి మెజార్టీ ఉంది కనుక ఓం బిర్లా స్పీకరుగా ఎన్నికవడం లాంఛనప్రాయమే. కానీ ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందనే ఇండియా కూటమి వాదనలు దేశ ప్రజలను తప్పక ఆలోచింపజేస్తాయి.  

లోక్‌సభ ఎన్నికలలో 370-400 సీట్లు వస్తాయనుకుంటే 300 కూడా ఎందుకు రాలేదని మోడీ ప్రభుత్వం ఆలోచించి ఉంటే నేడు ఈవిదంగా చేసి ఉండేదే కాదు కదా?


Related Post