కేసీఆర్ ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం?

June 26, 2024


img

తెలంగాణ ఏర్పడక మునుపు రాజకీయాలను పక్కన పెట్టి చూస్తే, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఫిరాయింపుల సంస్కృతిని ప్రారంభించింది బిఆర్ఎస్ పార్టీ దాని అధినేత కేసీఆర్‌ అనే అందరికీ తెలుసు. 

ప్రతిపక్షాలు తన ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని, బంగారి తెలంగాణ కోసం అంటూ కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను బిఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయింపజేసుకుని వాటిని నిర్వీర్యం చేశారు. 

అప్పుడు ఆ పార్టీలు స్పీకర్‌ని కలిసి ఫిరాయించిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని ప్రాధేయపడినా పట్టించుకోలేదు. పైగా కాంగ్రెస్‌, టిడిపిల నుంచి వచ్చిన నేతలను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు కూడా. 

ఇప్పుడు కాంగ్రెస్‌, బీజేపీలు కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేస్తుంటే అన్యాయం, అక్రమం అంటూ కేసీఆర్‌, కేటీఆర్‌, జగదీష్ రెడ్డి వాదిస్తున్నారు. ఆనాడు తాము ఇదే తప్పు చేశామనే సంగతి అసలు గుర్తే లేన్నట్లు మాట్లాడుతుండటం, కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన తమ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

అధికారంలో ఉన్నప్పుడే కాదు... లేనప్పుడు కూడా కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీతో పొత్తుల కోసం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్‌ వస్తే, ఆయనకు నాగర్‌కర్నూల్‌ ఎంపీ టికెట్‌ ఆశజూపి, బీఎస్పీకి రాజీనామా చేయించడమే ఇందుకు తాజా నిదర్శనం. తద్వారా రాష్ట్రంలో బీఎస్పీని ఒక్క దెబ్బతో నిర్వీర్యం చేసేశారు కదా?  

బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండి ఉంటే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో చక్కటి రాజకీయ సంస్కృతి ఏర్పడి ఉండేది. అది కొనసాగుతూ ఉంటే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి ఈ దుస్థితి కలిగి ఉండేదే కాదు. కానీ ప్రజలు ఎన్నుకున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తానని బెదిరిస్తూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా సాగుతూ, ఆ ప్రజాస్వామ్యమే తన పార్టీని కాపాడాలని కేసీఆర్‌ కోరుకోవడం చాలా విడ్డూరంగా ఉంది కదా?   

అధికారం రుచి మరిగిన కేసీఆర్‌ ఎప్పటికీ తెలంగాణలో తాను, తన కుటుంబ సభ్యులు, తన పార్టీ మాత్రమే అధికారంలో ఉండాలనే దురాలోచనతో ఫిరాయింపుల విష సంస్కృతిని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆయన కూడా దానికి మూల్యం చెల్లిస్తున్నారు.

అయితే ఇది స్వయంకృతమే కనుక ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. కనుక ఫిరాయింపులతో కూలిపోతున్న బిఆర్ఎస్ పార్టీని ఏవిదంగా కాపాడుకోవాలో ఆలోచిస్తే మంచిది.


Related Post