సుమారు రెండున్నర దశాబ్ధాలు తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ శాసించారు. కానీ ఒకే ఒక్క ఎన్నికలో ఓటమితో ఆయన ప్రతిష్ట ఇంతగా మసకబారుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మొదటి దెబ్బకే ఢీలా పడిన బిఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు గెలుచుకోలేక మరోసారి దారుణంగా ఓడిపోవడంతో కేసీఆర్ ప్రతిష్ట మరింత మసకబారుతోంది.
ఆయన నాయకత్వంపై నమ్మకం లేక ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారా లేదా బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ కోలుకునే అవకాశం లేదని ఎవరి దారి వారు చూసుకుంటున్నారా లేదా కాంగ్రెస్, బీజేపీల ప్రలోభాలకు ఆశపడి వెళ్ళిపోతున్నారా? అంటే అన్నీను అని చెప్పుకోవలసి ఉంటుంది.
పార్టీలో నుంచి వెళ్ళిపోతున్నవారు జూనియర్లు ఏమీ కారు. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్ అందరూ చాలా సీనియర్లే... కేసీఆర్‌తో కలిసి చాలా కాలం పనిచేసినవారే.
ఇంతమంది సీనియర్లు పార్టీని వీడి వెళ్ళిపోతుంటే ఆ ప్రభావం బిఆర్ఎస్‌పై తప్పక ఉంటుంది. వారితో పాటు ఆయా జిల్లాలు, నియోజకవర్గాలలో వారి క్యాడర్ కూడా బిఆర్ఎస్‌కు దూరం అవుతుంది. కనుక అక్కడ బిఆర్ఎస్ చాలా బలహీన పడుతుంది. ప్రస్తుత పరిస్థితులలో మళ్ళీ అక్కడ బిఆర్ఎస్‌ని బలోపేతం చేసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది కూడా. కనుక ఈ నష్టాని తక్కువ చేసి చూపుకుంటే బిఆర్ఎస్ పార్టీకే ఇంకా నష్టం జరుగుతుంది.
కానీ ‘కొంతమంది ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వీడినంత మాత్రన్న ఎటువంటి నష్టమూ లేదని’ కేసీఆర్ ధీమా వ్యక్తం చేయడం విశేషం. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యి పార్టీ తాజా పరిస్థితిపై చర్చించినప్పుడు కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బిఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుందని, మళ్ళీ అధికారంలోకి వస్తుందని, కనుక ఎవరూ అధైర్యపడవద్దని కేసీఆర్ వారికి ధైర్యం చెప్పారు. అయితే భవిష్యత్‌లో ఏదైనా అనూహ్యమైన రాజకీయ పరిణామాలు జరిగితే తప్ప బిఆర్ఎస్ పార్టీ ఏవిదంగా కోలుకోగలదో కేసీఆర్ కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.