ఇంతకాలం తన సినిమాలతో తెలుగు ప్రజలను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాజకీయాలలో పదేళ్ళపాటు డక్కామొక్కీలు తిన్న తర్వాత ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా సెకంగ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. పవన్ కళ్యాణ్‌కు సినిమాలలో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’గా ఉన్నారు. కానీ రాజకీయాలలో మాత్రం ఆయనకు ‘గాడ్ ఫాదర్’ ఎవరూ లేరు.
ప్రజారాజ్యంతో చిరంజీవి విఫలైన చోటి నుంచి పవన్ కళ్యాణ్ జనసేనతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించడం, చిరంజీవి విఫలమైన రాజకీయాలలోనే పవన్ కళ్యాణ్ విజయం సాధించడం విశేషమే కదా?
ఈ పదేళ్ళలో పవన్ కళ్యాణ్ అనేక రాజకీయ ప్రయోగాలు చేశారు. వాటితో ఎదురుదెబ్బలు తిని వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. రాజకీయాలలో అనుభవం, అదృష్టంతో పాటు ఓర్పు, సంయమనం, మాట పొదుపు చాలా అవసరమని పవన్ కళ్యాణ్ నిరూపించి చూపారు.
రాజకీయాలలో ఎదురుదెబ్బలను ఓర్చుకొనే శక్తి తనకు ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకునేవారు. నిజంగానే అంత ఓర్పుతో పట్టుదలతో ముందుకు సాగి చివరికి తాను స్వయంగా విజయం సాధించడమే కాకుండా తనను నమ్ముకున్న జనసేన పార్టీ నేతలని, కార్యకర్తలని కూడా గెలిపించుకున్నారు.
అంతేకాదు... మోడీ, అమిత్ షా-చంద్రబాబు నాయుడు మద్య రాజీ కూడర్చి టిడిపి-బీజేపీలు పొత్తులు కుదర్చడంలో కూడా పవన్ కళ్యాణ్‌దే కీలకపాత్ర. వాటి పొత్తుల కోసం జనసేన సీట్లను త్యాగం చేయగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడటం వల్లనే ఏపీలో టిడిపి, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రాగలిగింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వ ఏర్పాటుకి టిడిపి ఎంపీల మద్దతు కూడా లభించింది.
ఈ కారణంగా పవన్ కళ్యాణ్ ఇటు రాష్ట్ర స్థాయిలో, అటు జాతీయ స్థాయిలో కూడా కీలకవ్యక్తిగా నిలిచారు. పవన్ కళ్యాణ్ దుందుడుకుతనం చూసినవారు, ఆయన రాజకీయ రంగాలలో కూడా ఇంతగా రాణించడం చూసి ఇప్పుడు ఆశ్చర్యపోక మానరు.