ఒకే ఒక ఓటమితో ఇంత దయనీయ పరిస్థితా? ఎందువల్ల?

June 11, 2024


img

సుమారు రెండున్నర ధశాబ్ధాలుగా కేసీఆర్‌ తెలంగాణ రాజకీయాలను  శాశిస్తున్నారు. అదేవిదంగా జగన్మోహన్‌ రెడ్డి గత 5 ఏళ్ళుగా ఏపీలో రాజకీయాలను శాశించారు. కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని కళ్ళకు కనబడే అంతగా అభివృద్ధి చేశారు. అనేక చక్కటి సంక్షేమ పధకాలు అమలుచేశారు. 

జగన్మోహన్‌ రెడ్డి ప్రజలు అడగకుండానే సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు పంచిపెట్టారు. కానీ ఇక్కడ కేసీఆర్‌ని, అక్కడ జగన్‌ని ప్రజలు తిరస్కరించారు. 

రాజకీయ పార్టీలకు గెలుపోటములు సహజమే అనుకున్నా ఒకే ఒక్క ఎన్నికలలో ఓటమితో ఇద్దరు పాపులర్ నేతలు, వారి రెండు పార్టీలు ఇంత దయనీయ స్థితికి దిగజారిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాంగ్రెస్‌, బీజేపీ, టిడిపిలు ఎన్నో ఓటములను తట్టుకొని నిలబడ్డాయి కదా?

మరి బిఆర్ఎస్, వైసీపిలు మాత్రం ఒక్క ఓటమితోనే ఇంత దయనీయ పరిస్థితిలో ఎందుకు ఉన్నాయి?అని ఆలోచిస్తే కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ నిరంకుశవాదుల్లా వ్యవహరిస్తూ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలకు అందరికీ దూరమవడం ఓ కారణంగా కనిపిస్తోంది. కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ కూడా మిత్రుల కంటే అందరితో శతృత్వం పెంచుకుంటూ చుట్టూ శత్రువులను తయారుచేసుకోవడం మరో కారణంగా కనిపిస్తోంది. 

తెలంగాణలో బీజేపీ ఎదుగుదలని అడ్డుకునేందుకు కేసీఆర్‌ మోడీతో కయ్యానికి కాలు దువ్వడం వలన ఎన్డీఏ కూటమికి దూరంగా ఉండిపోవలసి వచ్చింది. అదేవిదంగా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయ విభేదం ఉన్నందున ఇండియా కూటమికి దూరంగా ఉండిపోవలసి వచ్చింది. 

చంద్రబాబు నాయుడు కూడా ఇదివరకు ప్రధాని నరేంద్రమోడీపై కత్తులు దూసినప్పటికీ ఈసారి మళ్ళీ స్నేహం కలుపుకొని ఏపీలో అధికారంలోకి రాగలుగుతున్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ కీలకంగా మారారు కూడా. 

మరోపక్క తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి తోడ్పడి దానితో కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఈవిదంగా బద్ద విరోద్ధులైన కాంగ్రెస్‌, బీజేపీలతో చంద్రబాబు నాయుడు సత్సంబంధాలు నెలకొల్పుకొని రాజకీయంగా మళ్ళీ పైకి లేవగలిగారు. 

కానీ చంద్రబాబు నాయుడు కంటే తాను చాలా మేధావినని కేసీఆర్‌ నమ్ముతున్న కేసీఆర్‌ తన గురించి అతిగా ఊహించేసుకొని అందరినీ శత్రువులుగా మార్చుకొని రాజకీయ ఏకాకిగా మిగిలిపోయారు. 

అక్కడ ఏపీలో జగన్‌ కూడా ఇంచు మించు ఇలాగే ప్రవర్తించి ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకొని ఇప్పుడు తాపీగా బాధపడుతున్నారు. కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ స్వయంకృతాపరాధాల వలననే నేడు ఈ దుస్థితికి చేరుకున్నారని చెప్పక తప్పదు.


Related Post