ఎట్టకేలకు బండి సంజయ్‌ కృషి, త్యాగాలకు ప్రతిఫలం

June 11, 2024


img

బీజేపీలో ఓ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్‌ ఎదిగిన తీరు రాజకీయాలలో ఉన్నవారందరికీ స్పూర్తిదాయకం అని చెప్పవచ్చు. 

ఆయన రాజకీయ ప్రస్థానంలో తగిలిన ఎదురుదెబ్బలు అన్నీ ఇన్నీ కావు. 2014,2018,2023 శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి మూడు సార్లు ఓడిపోయారు. 

తెలంగాణలో కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీ ధాటికి తట్టుకోలేక బీజేపీ నిస్తేజంగా మారినప్పుడు 2020లో బండి సంజయ్‌ చేతికి అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పజెప్పింది. ఆ పరిస్థితిలో పార్టీని నడిపించడమే కష్టం. కానీ ఒక్క ఏడాదిలోనే పార్టీని పరుగులు పెట్టించారు. 

పదో తరగతి, ఇంటర్ ఫలితాలలో గందరగోళం, టీజీపీఎస్‌ఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారం, జీవో 317 తదితర అంశాలపై బండి సంజయ్‌ చేసిన పోరాటాల కేసీఆర్‌కి ముచ్చెమటలు పట్టించారు.బండి సంజయ్‌ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత దుబ్బాక ఉప ఎన్నికలో, మళ్ళీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి కంగు తినిపించారు. 

బండి సంజయ్‌ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడంతో అప్రమత్తమైన కేసీఆర్‌ ఆయనను ఎదుర్కోవడం నామోషీగా భావించి తప్పటడుగు వేస్తూ మోడీపై కత్తులు దూయడం మొదలుపెట్టారు. అంటే కేసీఆర్‌ చేత ఆ తప్పు చేయించి, బిఆర్ఎస్ పార్టీ పతనానికి బీజం వేసింది బండి సంజయ్‌ అనే చెప్పవచ్చు.

రాష్ట్రంలో ఉందో లేదో అనుకునే బీజేపీని, బిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ స్థాయికి తీసుకువెళ్ళిన క్రెడిట్ ఖచ్చితంగా బండి సంజయ్‌కే దక్కుతుంది. 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం అనుకుంటున్న సమయంలో బీజేపీ అధిష్టానం బండి సంజయ్‌ని అధ్యక్ష పదవిలో నుంచి తప్పించడం బీజేపీ చరిత్రలో ఓ చారిత్రిక తప్పిదంగా నిలిచిపోతుంది. 

శాసనసభ ఎన్నికలకు ముందు తనను తొలగించి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించినందుకు బండి సంజయ్‌ చాలా బాధపడ్డారు కూడా. చాలా ఆవేశపరుడైన బండి సంజయ్‌ ఆ సమయంలో చాలా సంయమనం పాటిస్తూ, అధిష్టానం ఆదేశానికి కట్టుబడి ఉండటం అందరినీ చాలా ఆశ్చర్యపరిచింది కూడా. కానీ ఆ రోజు ఆవిదంగా వ్యవహరించడం వలననే నేడు ఈ స్థాయికి ఎదగగలిగారని చెప్పవచ్చు. 

మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా బండి సంజయ్‌ ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా పట్టుదలగా పనిచేస్తూ తాను ఓడిపోయిన కరీంనగర్‌ నుంచే 2019లో, మళ్ళీ 2024లో ఎంపీగా ఎన్నికయ్యారు. బండి సంజయ్‌ రాజకీయ ప్రస్థానంలో ఈ ఓటములు, ఎదురుదెబ్బలు, ఎదుగుదలకు పట్టుదల, కఠోర శ్రమ అందరికీ కనిపిస్తాయి. కానీ రాజకీయాలలో రాణించాలనుకునేవారికి చాలా సహనం కూడా ఉండాలనే విషయం తెలియజేస్తోంది.     



Related Post