ప్రధాని పదవిని వద్దనుకునే ఎన్డీయేతో వెళ్తున్నాం: జేడీయు

June 09, 2024


img

లోక్‌సభ ఎన్నికలలో ఎన్డీయేకి 293 సీట్లు రాగా, ఇండియా కూటమికి 234 వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకి 272 సీట్లు అవసరం. కనుక బిహార్‌లోని జేడీయూ, ఏపీలోని టిడిపిని కలుపుకోగలిగితే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని భావించారు. కనుక తమతో కలిస్తే నితీష్ కుమార్‌కి ప్రధాన మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు. 

అయితే ఇదివరకు ఇండియా కూటమికి నాయకుడుగానే నితీష్ కుమార్‌ పనికిరారని భావించినప్పుడు, ఇప్పుడు ప్రధాని పదవికి ఏవిదంగా పనికివస్తారు? వారికి అవసరం ఉన్నప్పుడు మమ్మల్ని కలుపుకొని లేనప్పుడు పక్కన పెట్టేసే కూటమితో కలిసి పనిచేయలేము. అందుకే వారు ఇచ్చిన ఆ ఆఫర్ తిరస్కరించాము. రాబోయే 5 ఏళ్ళు ఎన్డీయే కూటమితోనే ఉంటాము. మా ప్రధాన లక్ష్యం బిహార్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంపాదించడమే. దాని కోసం ప్రయత్నిస్తూనే ఉంటాము,” అని చెప్పారు.   

టిడిపి ఇండియా కూటమిలో కలిసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించినప్పుడే చంద్రబాబు నాయుడు తమకు అటువంటి ఆలోచన లేదని తాము ఎన్డీయేతో కొనసాగుతామని ఖరాఖండీగా చెప్పేశారు. 

నితీష్ కుమార్‌ ఎప్పటికైనా ప్రధానమంత్రి కావాలని కలలు కనేవారు. ఇండియా కూటమి ద్వారా ఆ కల సాకారం చేసుకోగల అవకాశం వచ్చినప్పుడు దానిని వదులుకున్నారంటే తాను కూటమితో కలిసినా కేంద్ర ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదని భావించి ఉండవచ్చు లేదా ఇండియా కూటమిలో  కర్ర పెత్తనం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ చేతిలో తాను కీలుబొమ్మ ప్రధానిగా మిగిలిపోతానని భావించి ఉండవచ్చు లేదా మరో బలమైన కారణం ఏదో ఉండి ఉండవచ్చు.


Related Post