మోడీ ప్రధాని అవుతారని పాకిస్తాన్ భావించడం లేదా?

June 08, 2024


img

లోక్‌సభ ఎన్నికలలో ఎన్డీయే విజయం సాధించగానే పలు దేశాధినేతలు ఫోన్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా  ప్రధాని నరేంద్రమోడీకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. దీనిపై పాక్ మీడియా ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్‌ని ప్రశ్నించినప్పుడు ఆమె చాలా చిత్రమైన సమాధానం చెప్పారు. 

“భారత్‌ ప్రజలకు వారికి నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్వేచ్చా, హక్కు ఉన్నాయి. ఢిల్లీలో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. కనుక అప్పుడే మేము అభినందనలు చెప్పడం తొందరపాటే అవుతుంది. భారత్‌లో ఎవరు అధికారం చేపట్టినప్పటికీ ఆ దేశంతో మేము స్నేహం, శాంతినే కోరుకుంటాము,” అని చెప్పారు. 

ఈసారి ఇండియా కూటమికి 232 సీట్లు వచ్చాయి కనుక ఎన్డీయేలో కొన్ని పార్టీలు మోడీని కాదని ఇండియా కూటమికి మద్దతు ఇస్తాయని పాకిస్తాన్ ఎదురుచూస్తోందని, అందుకే మోడీకి అభినందనలు తెలుపలేదని    అర్దమవుతోంది. 

భారత్‌ ప్రజలకు వారి నాయకత్వాన్ని నిర్ణయించుకునే హక్కు ఉందని ఆమె చెప్పడం అదే సూచిస్తోంది. కానీ ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కనుక పాకిస్తాన్ కలలు పగటి కలలుగానే మిగిలిపోనున్నాయి.

కానీ పాకిస్తాన్ ఈ విధంగా ప్రవర్తించడం, మాట్లాడటం వలన మోడీ ప్రభుత్వంతో ఇంకా బిగుసుకు పోవచ్చు కనుక భారత్‌-పాక్ సంబంధాలు ఇంకా దెబ్బ తినవచ్చు.


Related Post