రాహుల్ రాయ్ బరేలీ, వయనాడ్... దేనికి రాజీనామా?

June 08, 2024


img

కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికలలో యూపీలోని రాయ్ బరేలీ నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ రెండు చోట్ల నుంచి పోటీ చేసి రెండు చోట్ల గెలిచారు. కనుక ఈ రెండు సీట్లలో ఏదో ఒక దానిని వదులుకోవలసి ఉంటుంది. 

సోనియా, రాహుల్ గాంధీలకు రాయ్ బరేలీ కంచుకోట వంటిది. కానీ కేరళలోని వయనాడ్ ప్రజలు రాహుల్ గాంధీ మీద అభిమానంతో మళ్ళీ మరోసారి ఎంపీగా ఎన్నుకున్నారు. కనుక రెంటిలో ఏ సీటుని వదులుకున్నా అక్కడి ప్రజలు తమ ఓట్లు వృధా అయ్యాయని నొచ్చుకుంటారు. 

కానీ ఎన్నికల నియమావళి ప్రకారం ఫలితాలు వెలువడిన రెండు వారాలలోగా అంటే ఈ నెల 18లోపుగా ఏదో ఒక ఎంపీ సీటుకి రాజీనామా చేసి ఆ విషయం కేంద్ర ఎన్నికల కమీషన్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేయవలసి ఉంటుంది. లేకుంటే రెండు స్థానాలలో అనర్హత వేటు వేస్తుంది. కనుక రాహుల్ గాంధీ రెంటిలో ఏ సీటు అట్టే బెట్టుకుంటారు? దేనిని వదులుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 

కాంగ్రెస్‌-ఇండియా కూటమి ఈసారి లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకొని ఎన్డీయే కూటమికి ధీటుగా 232 సీట్లు గెలుచుకుంది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ రాజీనామాతో ఒక సీటు తగ్గుతుంది. దానికి మళ్ళీ ఉపఎన్నికలు జరిగి దానిని మళ్ళీ కాంగ్రెస్‌ గెలుచుకుంటే ఆ ఒక్క సీటు కూడా నష్టపోదు లేకుంటే కాంగ్రెస్‌ ఖాతాలో నుంచి ఓ సీటు చేజేతులా వదిలేసుకున్నట్లే అవుతుంది.    



Related Post