బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్‌లోకి వచ్చేయండి: దానం

June 08, 2024


img

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రాష్ట్ర రాజకీయాలలో మార్పులు చేర్పులు మొదలవుతాయని మూడు ప్రధాన పార్టీల నేతలే స్వయంగా చెప్పుకున్నారు. ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. ఊహించిన్నట్లేఅప్పుడే  కాంగ్రెస్‌ పార్టీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వల విసురుతోంది. 

ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గూటికి చేరుకొని సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కనుక ఆయన కాంగ్రెస్ పార్టీలో తన ప్రాధాన్యత తగ్గకుండా చూసుకోవలసిన అవసరం ఏర్పడింది. 

అందుకే శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియా ద్వారా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవాలని పిలునిచ్చారు. 

“బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మీరు (బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు) ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో బిఆర్ఎస్‌ అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారంటే మీ పార్టీ పరిస్థితి అర్దమవుతోంది. 

మీరు కేసీఆర్‌ని నమ్ముకొని ఇంకా బిఆర్ఎస్ పార్టీలో ఉంటే మీరే నష్టపోతారు. కనుక మీ రాజకీయ భవిష్యత్‌ గురించి ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరితే సిఎం రేవంత్‌ రెడ్డి తప్పకుండా మీకు తగిన ప్రాధాన్యత ఇస్తారు,” అని దానం నాగేందర్ బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు బహిరంగంగా ఆహ్వానం పలికారు. 

లోక్‌సభ ఎన్నికలకు ముందే కొంత మంది కాంగ్రెస్‌లోకి వచ్చేసేందుకు సిద్దపడ్డారని సిఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా చెప్పారు. కనుక ఇప్పుడు ఎంత మంది కారు దిగి కాంగ్రెస్‌ స్నేహ హస్తం అందుకుంటారో చూడాలి.     



Related Post