విజయాలకు చిరునామా రామోజీరావు

June 08, 2024


img

ప్రజల అవసరాలను పసిగట్టి రకరకాల ఐడియాలతో, రకరకాల యాప్స్, వ్యాపారాలు చేసేవారు ఇప్పుడు పుట్టుకొస్తున్నారు. కానీ 60వ దశకంలోనే రామోజీరావు ప్రజల అవసరాలను గుర్తించి రకరకాల వ్యాపారాలు చేసి విజయవంతమైన వ్యాపారస్తుడుగా నిలిచారు. 

చెరుకూరి రామోజీ రావు 1936, నవంబర్‌ 16న కృష్ణాజిల్లా పెదపారుపూడిలో జన్మించారు. 1974, ఆగస్ట్ 10వ తేదీన విశాఖపట్నంలో ఈనాడు దినపత్రికని స్థాపించారు. అప్పట్లో ఏరోజూకారోజు వార్తా పత్రికలు ప్రజల చేతికి అందడం ఓ అద్భుతంగా ఉండేది. ఈనాడుతో ఆ అద్భుతాన్ని రామోజీరావు ఆవిష్కరించారు. 

ఆ తర్వాత ఈనాడు ‘లోకల్ ఎడిషన్’ మరో సంచలనం. సినిమా వార్తలను అందించే ‘సితార’ పత్రికతో రామోజీరావు మరో సంచలనం సృష్టించారు. 

ఆనాడు తెలుగువారందరికీ వార, మాస పత్రికలు, ముఖ్యంగా కధలు, నవలలు తదితర సాహిత్యం పుస్తకాలు చదివే అలవాటు బాగా ఉండేది. అది గమనించిన రామోజీరావు విపుల, చతుర, సితార, అన్నదాత వంటి విభిన్నమైన మాస పత్రికలు ప్రచురించి ప్రజల మనసులు దోచుకున్నారు. 

విశాఖ నగరం చాలా అభివృద్ధి చెందుతుందని గుర్తించిన రామోజీరావు విశాఖ నడిబొడ్డున డాల్ఫిన్ స్టార్ హోటల్‌ నిర్మించారు. 

సామాన్య ప్రజల కష్టార్జితానికి భద్రత, తగిన ప్రతిఫలం అందించే సంస్థలు లేవని గుర్తించిన రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ స్థాపించి తెలుగు ప్రజలకు ఓ నమ్మకమైన సంస్థగా ఎదిగింది అది. దేశ విదేశాలలో ఉన్న తెలుగువారు రుచికరమైన పచ్చళ్ళు దొరక్క ఇబ్బందిపడుతున్నారని గుర్తించిన రామోజీరావు ప్రియా ఫుడ్స్ స్థాపించి నోరూరించే పచ్చళ్లు అందించి, లాభాలు ఆర్జించారు. 

మీడియా, వ్యాపార రంగాలలో అనుభవం గడించిన రామోజీరావు దృష్టి సినీ పరిశ్రమపై పడింది. ఉషా కిరణ్ మూవీస్‌ సంస్థాని స్థాపించి అనేక సూపర్ హిట్ సినిమాలు అందించి తెలుగు ప్రజలను రంజింప జేశారు.   

దర్శక నిర్మాతల కష్టాలను గుర్తించిన రామోజీరావు హైదరాబాద్‌లో సకల సౌకర్యాలతో రామోజీ ఫిలిమ్ సిటీని నిర్మించారు. 

ఈనాడు అధ్వర్యంలో ఈటీవీ న్యూస్ ఛానల్‌ ఛానల్ ఏర్పాటు చేశారు. మీడియా, వ్యాపార రంగాలలో ఉన్న రామోజీరావు దృష్టి రాజకీయాలపై కూడా పడింది. ఆయన ఎన్టీఆర్‌, తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలిచి సమైక్య రాష్ట్రంలో తొలిసారిగా ఓ ప్రాంతీయ పార్టీ టిడిపి అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. 

ఆ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడుకి బాసటగా నిలిచి రాజకీయంగా ఆయన ఎదుగుదలకు, టిడిపి విజయాలకు తోడ్పడ్డారు. మళ్ళీ ఇప్పుడు ఏపీలో టిడిపి కూటమి అధికారంలోకి రావడానికి రామోజీరావు తన ఈనాడు మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లకు ఎంతగానో తోడ్పడ్డారు. 

ఈవిదంగా రామోజీరావు వివిద రంగాలలో ప్రవేశించి, ప్రతీ రంగంపై తనదైన ముద్ర వేస్తూ ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తూ అందరికీ స్పూర్తిదాయకంగా నిలిచారు. తన సంస్థల ద్వారా వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు కల్పించారు.

తన జీవితానికి ఓ పరమార్ధం కల్పించుకొని పరిపూర్ణ పురుషుడుగా రామోజీరావు ఇక సెలవు అంటూ కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. 


Related Post