జూ.ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌... ఇద్దరూ మిస్సింగ్!

June 07, 2024


img

ఏపీ ఎన్నికలలో టిడిపి, జనసేన కూటమి గెలిచి అధికారంలోకి రాబోతుండటంతో యావత్ సినీ పరిశ్రమ చాలా సంతోషంగా ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌, ఆయన సోదరుడు నాగబాబు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ ముగ్గురూ సినీ పరిశ్రమకు చెందినవారు కావడం, టిడిపితో సినీ ప్రముఖులందరికీ బలమైన సత్సంబంధాలు ఉండటంతో వారి విజయానికి అందరూ సంతోషిస్తున్నారు.

ఇంత కాలం జగన్‌ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమని చాలా వేధించింది కనుక జగన్‌ ఓటమిని వారు మనసారా ఆస్వాదించే ఉంటారు. ఇక తెలుగు సినీ పరిశ్రమకు మంచి రోజులు మొదలయ్యాయని అందరో అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, బాలకృష్ణలను అందరూ అభినందిస్తున్నారు. కానీ సినీ పరిశ్రమలో ఇద్దరు హీరోలు జూ.ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ మాత్రం తమ కుటుంబాలలో జరుగుతున్న ఈ వేడుకలకు దూరంగా ఉండిపోయారు. కారణాలు అందరికీ తెలిసినవే.

జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ ఖండించారు. కానీ జూ.ఎన్టీఆర్‌ మౌనంగా ఉండిపోయి టిడిపి నేతలకు ఆగ్రహం కలిగించారు. ఆయన 2014 ఎన్నికల నుంచే టిడిపికి దూరమైనప్పటికీ, చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండిస్తూ ఒక ట్వీట్‌ చేయకపోవడాన్ని టిడిపిలో అందరూ తప్పు పట్టారు. కనుక టిడిపికి జూ.ఎన్టీఆర్‌కి మద్య ఇంకా దూరం పెరిగిందనే చెప్పాలి. 

ఎన్నికల సమయంలో పవన్‌ కళ్యాణ్‌కు మద్దతు తెలిపినవారిలో అల్లు అర్జున్‌ కూడా ఒకరు. కనుక ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్‌ పాల్గొనకపోయినప్పటికీ ఎవరూ ఏమీ అనుకోలేదు. కానీ పవన్‌ కళ్యాణ్‌ కోసం రాకపోయినా, పోలింగ్‌ ముందు రోజు తన భార్యతో కలిసి నంద్యాలలో తన స్నేహితుడు, వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవీంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్ళడం వివాదాస్పదం అయ్యింది.

అల్లు అర్జున్‌ నంద్యాలకు వచ్చినప్పుడు శిల్పా రవీంద్ర కిషోర్ రెడ్డి  అనుచరులతో పాటు అల్లు అర్జున్‌ అభిమానులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో జనసేన జెండాలు ప్రదర్శించారు.

పవన్‌ కళ్యాణ్‌ అధ్వర్యంలో జనసేన వైసీపితో యుద్ధం చేస్తుంటే, అల్లు అర్జున్‌ వైసీపికి మద్దతు పలకడంతో మెగా ఫ్యామిలీ ఆయనపై గుర్రుగా ఉంది. కనుక ఈ వేడుకలకు అల్లు అర్జున్‌ దూరంగా ఉండిపోయారు.


Related Post