బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జాతీయ స్థాయిలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై వేసిన అంచనాలు, అలాగే తెలంగాణలో ఫలితాలపై వేసిన అంచనాలు మళ్ళీ తప్పాయి. ఈసారి బిఆర్ఎస్ పార్టీకి 12కి పైగా ఎంపీ సీట్లు వస్తాయనుకుంటే ఒక్కటి కూడా రాలేదు.
ఈసారి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకి ఇండియా, ఎన్డీయే కూటములు రెంటికీ పూర్తి మెజారిటీ రాదని, అప్పుడు బిఆర్ఎస్, వైసీపి, తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలకు అవి మద్దతు ఈయక తప్పదని కేసీఆర్ జోస్యం చెప్పారు. కానీ అది కూడా తప్పింది.
గత ఎన్నికల కంటే ఈసారి ఎన్డీయేకి కొన్ని సీట్లు తగ్గినప్పటికీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. అలాగే కాంగ్రెస్-మిత్రపక్షాలు కూడా ఈసారి ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకొని ఏకంగా 232 సీట్లు గెలుచుకుంది.
కనుక కేంద్రంలో చక్రం తిప్పాలనే కేసీఆర్ కోరిక నెరవేరకపోగా రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందిప్పుడు. అయితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏనాడూ కేంద్రంలో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలకలేదు కానీ ఇప్పుడు ఎన్డీయేలో భాగస్వామిగా మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టేందుకు మద్దతు ఇస్తూ కీలక పాత్ర పోషించబోతున్నారు.