పవన్-జగన్‌ ఎంత తేడా!

June 07, 2024


img

ఏపీ మాజీ సిఎం జగన్మోహన్‌ రెడ్డికి, జనసేన అధ్యక్షుడు, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కళ్యాణ్‌కు మద్య తేడా నిన్న మరోసారి స్పష్టంగా కనిపించింది. 

పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవడం, జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలను గెలుచుకోవడంతో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో నిన్న పండగ వాతావరణం నెలకొంది.

పవన్‌ కళ్యాణ్‌ ముందుగా తెలంగాణ తల్లి అంజనాదేవికి ఆ తర్వాత అన్నావదినలు చిరంజీవి, సురేఖ దంపతులకు పాదాభివందనం చేశారు. వారు కూడా పవన్‌ కళ్యాణ్‌ని ఆప్యాయంగా కౌగలించుకొని ఆశీర్వదించారు. ఆ తర్వాత అందరూ కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ వారికి పాధాభివందనం చేస్తుండటం చూస్తున్న బంధుమిత్రులు కూడా చాలా సంతోషించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు, సామాన్య ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నేపధ్యంలో మళ్ళీ జగన్‌ కుటుంబ సంబంధాలపై చర్చ మొదలైంది. అక్రమాస్తుల కేసులో జగన్‌ చంచల్‌గూడా జైల్లో ఉండగా వైఎస్ షర్మిల పాదయాత్రలు చేసి వైసీపి చెల్లాచెదురు అయిపోకుండా  కాపాడారు. గత ఎన్నికలలో వైసీపి గెలుపు కోసం ఎంతగానో శ్రమించారు. 

కానీ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే తన కోసం ఇంతగా శ్రమించిన చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా, తన ప్రభుత్వంలో పదవులు ఇవ్వకుండా అన్యాయం చేశారు. దాంతో ఆమె ఏపీని వదిలేసి తెలంగాణకు వచ్చేశారు.

ఆ తర్వాత జగన్‌ తన తల్లి విజయమ్మని కూడా పార్టీ నుంచి, రాష్ట్రం నుంచి స్వయంగా బయటకు సాగనంపారు. అప్పుడు ఆమె కన్నీళ్ళు పెట్టుకొని కూతురు కోసమే వెళ్ళిపోతున్నాని సర్ధిచెప్పుకున్నారు.

ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే. ఆనాడు జగన్‌ని గెలిపించిన తల్లీ, చెల్లే ఈసారి ఆయన ఓటమికి కారణం కావడం విశేషం. 

గత ఎన్నికలకు ముందు జగన్‌ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్యలో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి జగన్‌ అండగా నిలిచి ఎందుకు కాపాడుతున్నారు? అని సొంత చెల్లి షర్మిలే ప్రశ్నించారు. అంటే బాబాయ్ హత్య వెనుక అన్న హస్తం ఉందని ఆమె అనుమానిస్తున్నట్లు భావించవచ్చు. 

ఈవిదంగా జగన్‌ కుటుంబ సభ్యులు అందరినీ దూరం చేసుకొని పదవీ, అధికారం, సమాజంలో గౌరవం అన్నీ కోల్పోగా, పవన్‌ కళ్యాణ్‌ మాత్రం కుటుంబ సభ్యులందరితో బలమైన బంధాలు కలిగి పదవీ, అధికారం, సమాజంలో గౌరవం పొందుతున్నారు. 



Related Post