ఇన్నేళ్ళుగా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఏది?అనే ప్రశ్న వినిపిస్తుండేది. కాంగ్రెస్, బీజేపీలు మేమేనని చెప్పుకుంటుండేవి. కానీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దానికి బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలలో ఏది ప్రత్యామ్నాయం? అనే కొత్త ప్రశ్న వినబడుతోంది.
బిఆర్ఎస్ పార్టీ వరుసగా రెండు ఎన్నికలలో ఓడిపోయినందున ‘మేమే’ అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీ మాత్రమే శ్రీరామరక్ష అని కేసీఆర్, కేటీఆర్ తదితరులు చెప్పుకుంటున్నారు. కానీ 8 ఎమ్మెల్యే, 8 ఎంపీ సీట్లు గెలుచుకొని తెలంగాణలో బలపడినందున తామే కాంగ్రెస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయమని, వచ్చే శాసనసభ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు చెప్పుకుంటున్నారు.
ఓ పార్టీ రాజకీయంగా బలపడటానికి 5 ఏళ్ళు సమయం అవసరమేమో కానీ బలహీనపడటానికి 5-6 నెలలు చాలని బిఆర్ఎస్ పార్టీని చూస్తే అర్దమవుతోంది.
బిఆర్ఎస్ ఉన్నంత కాలం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రమాదం పొంచే ఉంటుంది. బిఆర్ఎస్ బలంగా ఉన్నంత కాలం రాష్ట్రంలో బీజేపీ బలపడలేదు. కనుక రాష్ట్రంలో బీజేపీ బలపడాలనుకున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు మనుగడ సాగించాలన్నా బిఆర్ఎస్‌ని బలహీనపరచక మానవు. ఒకవేళ అవి బిఆర్ఎస్‌ని నిర్వీర్యం చేయగలిగితే అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బీజేపీ ఏకైక ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
కానీ కాంగ్రెస్, బీజేపీలు తమ పార్టీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుంటే కేసీఆర్ చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోరు. కానీ ప్రస్తుతం ఆయనకు ఎటు చూసినా శత్రువులే తప్ప మిత్రులు కనిపించడం లేదు. ఇది కూడా ఆయన స్వయంకృతాపరాధమే. కనుక బిఆర్ఎస్‌ని ఆయన కాపాడుకోగలరా లేదా? అనేది మాత్రమే ప్రస్తుతం ఆలోచించాల్సిన విషయం.