ప్రతీకార రాజకీయాలతోనే ఏపీ కాలక్షేపం?

June 06, 2024


img

గత 5 ఏళ్ళలో ఏపీలో జగన్‌ ప్రభుత్వం, వైసీపి నేతలు టిడిపి నేతలు, కార్యకర్తలకు నరకం చూపారు. ఇప్పుడు టిడిపి కూటమి అధికారంలోకి వస్తుండటంతో వారు వైసీపిపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్దమవుతున్నారు. 

జూన్ 4న ఫలితాలు వెలువడినప్పటి నుంచే ఏపీలో పలు జిల్లాలలో వైసీపి కార్యాలయాలు, సాక్షి మీడియా కార్యాలయాలపై టిడిపి శ్రేణులు దాడులు చేస్తున్నాయి. దీంతో ఏపీలో ఆయా ప్రాంతాలలో భయానకమైన వాతావరణం నెలకొని ఉంది. 

అయితే చంద్రబాబు నాయుడు కూడా జగన్‌ బాధితుడే కనుక చూసీ చూడన్నట్లు ఊరుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. జూన్ 12న ఆయన ప్రమాణ స్వీకారం చేయవచ్చని తెలుస్తోంది. అంతవరకు ఈ ప్రతీకార దాడులు కొనసాగుతూనే ఉండవచ్చని వైసీపి నేతలు ఆందోళన చెందుతున్నారు. 

ఈ దాడులను చంద్రబాబు నాయుడు నివారించినప్పటికీ, గత 5 ఏళ్ళుగా ఆయనతో సహా అందరినీ వేధించి వేటాడినందుకు ఇప్పుడు చంద్రబాబు కూడా తమపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయిస్తారని వైసీపి నేతలు, వారికి కొమ్ము కాసిన ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. 

గుడివాడ మాజీ వైసీపి ఎమ్మెల్యే కొడాలి నాని ఇదివరకు శాసనసభ సమావేశాలలో చంద్రబాబు నాయుడుని, ఆయన భార్య భువనేశ్వరి గురించి చాలా అవమానకరంగా మాట్లాడారు. అందుకు తాము తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని, కొడాలి నాని బత్తలూడదీసి గుడివాడ పట్టణంలో డ్రాయర్‌ ఊరేగిస్తామని నారా లోకేష్‌ శపదం చేశారు. దీనిని బట్టి ఏపీలో ప్రతీకార రాజకీయాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో అర్దం చేసుకోవచ్చు.      

ఇప్పటికే పలువురు అధికారులు సెలవుపై వెళ్ళిపోయేందుకు, మరికొందరు ఇతర రాష్ట్రాలకు బదిలీలపై వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఎవరికీ సెలవులు మంజూరు చేయవద్దని, ఎవరినీ రిలీవ్ చేయవద్దని ఆదేశించడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. 

ఏపీ ప్రభుత్వ కార్యదర్శి జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్ళిపోవలసిందిగా చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో నేడు ఆయన వెళ్ళిపోతున్నారు. కానీ మిగిలినవారు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఈవిదంగా అధికారంలోకి వచ్చినవారు ప్రతీకార రాజకీయాలతో కాలక్షేపం చేస్తుంటే ఇక ఏ రాష్ట్రమైనా ఎలా బాగుపడగలదు?


Related Post