సారి లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ వ్యూహం బాగానే ఫలించిందని చెప్పవచ్చు. ఇదివరకు 4 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఈసారి ఎన్నికలలో ఏకంగా 8 సీట్లు గెలుచుకోవడమే ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు. హైదరాబాద్ ఎంపీ సీటు దక్కించుకోవడానికి కూడా బీజేపీ చాలా చక్కటి వ్యూహమే అనుసరించింది.
అక్కడి నుంచి వరుసగా 4సార్లు ఎంపీగా గెలిచిన మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఈసారి ఓడించేందుకు హిందుత్వ అజెండాతో ముందుకు సాగే మాధవీలతని పార్టీలో చేర్చుకొని బరిలో దింపింది. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లో ఆమెను దింపడం సాహసమే అని చెప్పాలి.
కానీ హైదరాబాద్‌లో భారీగా ఉన్న హిందూ ఓటర్లు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడినవారి ఓట్లు, తెలంగాణవాసుల ఓటర్లు కాంగ్రెస్, మజ్లీస్, బీజేపీల మద్య చీలిపోతుంటారు. కనుక వారందరినీ బీజేపీవైపు ఆకర్షించి గంపగుత్తగా ఓట్లు పొందవచ్చనే గొప్ప ఆలోచనతో మాధవీలతని బరిలో దించింది.
అయితే ఎన్నికల ప్రచారంలో ఆమె చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ విమర్శల పాలయ్యారు. పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి, బురఖాలు ధరించి ఓట్లు వేయడానికి వచ్చిన ముస్లిం మహిళలను బురఖాలు తీసి మొహాలు చూశారు. దీనిపై చాలా వివాదం చెలరేగింది.
హైదరాబాద్‌పై మంచి పట్టున్న ఘోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహాయసహకారాలు తీసుకోకుండా ఒంటరిగా తనకు నచ్చిన్నట్లు ఎన్నికల ప్రచారం నిర్వహించడం వలన కూడా ఆమె ఓటమి పాలై ఉండవచ్చు.
అయితే మజ్లీస్ పార్టీ పలువురికి బురఖాలు వేసి దొంగ ఓట్లు వేయించిందని ఆమె ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆమె ఓ చక్కటి అవకాశాన్ని అత్యుత్సాహం ప్రదర్శించి చేజార్చుకున్నారని భావించవచ్చు.