తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్, బీజేపీలు చెరో 8 గెలుచుకోగా ఎప్పటిలాగే మజ్లీస్ హైదరాబాద్ సీటుని తిరిగి దక్కించుకుంది. మల్కాజ్‌గిరి, మెదక్ నుంచి విజయం సాధించిన ఈటల రాజేందర్, రఘునందన్ రావు బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కారాయలయంలో మీడియా సమావేశంలో లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీల గెలుపుకి కొత్త భాష్యం చెప్పారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ, “ఇదివరకు తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్‌గిరిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని సిఎం రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు. కానీ కాంగ్రెస్ ఓడిపోయింది. శాసనసభ ఎన్నికలలోనే మా బలం పెరిగింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో కూడా మా బలం ఇంకా పెరిగింది.
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి ఓటింగ్ శాతం 22కిపెరిగింది. కానీ కాంగ్రెస్‌కు ఒక్క శాతమే పెరిగింది. ప్రజలు కేసీఆర్ మీద ద్వేషంతోనే కాంగ్రెస్‌కు 8 సీట్లు ఇచ్చారు తప్ప రేవంత్ రెడ్డి పాలన చూసి కాదు. ఒకవేళ రేవంత్ రెడ్డి పాలన చూసి ఇచ్చారనుకుంటే ఈ ఎన్నికలలో మల్కాజ్‌గిరి, మెదక్, మహబూబ్ నగర్‌లో ఎందుకు గెలవలేకపోయింది?
ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోవడం గమనిస్తే తెలంగాణలో ఆ పార్టీ కధ ఇక ముగిసిపోయినట్లే భావించవచ్చు. తెలంగాణలో ఇకపై కాంగ్రెస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే,” అని ఈటల రాజేందర్ అన్నారు.
మెదక్‌లో హరీష్ రావు మద్దతుతో బీజేపీ గెలిచిందన్న సిఎం రేవంత్ రెడ్డి మాటలపై ఎంపీ రఘునందన్ రావు స్పందిస్తూ, “నేను ఎవరి సహకారం, దయాదాక్షిణ్యాలతో గెలవలేదు. నా స్వయంశక్తితో ప్రజల ఆశీర్వాదంతో ఎంపీగా ఎన్నికయ్యాను.
సొంత జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించుకోలేకపోయిన సిఎం రేవంత్ రెడ్డి మెదక్ ఎన్నికల గురించి మాట్లాడుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను గెలిచేందుకు హరీష్ రావు సహకరించిన్నట్లు తప్పుడు ప్రచారం చేయడం సరికాదు,” అని అన్నారు.