టిడిపి విజయం: రేవంత్‌ ప్రభుత్వానికి కూడా ఉపశమనమే!

June 05, 2024


img

2019 ఏపీ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్‌ వైసీపిని గెలిపించి జగన్‌ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఏవిదంగా తోడ్పడ్డారో, అదేవిదంగా 2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు నాయుడు కూడా రేవంత్‌ రెడ్డికి తోడ్పడి కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసి బాకీ తీర్చేశారు. 

అంతకు ముందు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో టిడిపి పొత్తు పెట్టుకున్నా ఫలించలేదు కానీ 2023 ఎన్నికలలో తెలంగాణలో టిడిపి పోటీ చేయకుండా తప్పుకోవడం ద్వారా కాంగ్రెస్‌ గెలవగలిగేలా చంద్రబాబు నాయుడు చేశారు. 

కనుక రేవంత్‌ రెడ్డి కూడా వైఎస్ షర్మిల రూపంలో చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ ‘రిటర్న్ గిఫ్ట్’ ఏపీలో జగన్మోహన్‌ రెడ్డిని ఓడించడానికి ఆయనకు ఎంతగానో ఉపయోగపడింది. 

అయితే వైఎస్ షర్మిల జగనన్న ముఖ్యమంత్రి పదవి ఊడగొట్టగలిగారు కానీ తాను మాత్రం ఎన్నికలలో గెలవలేకపోయారు. కనుక ఆమె చేసిన ఈ త్యాగానికి ఇప్పుడు రేవంత్‌ రెడ్డి మళ్ళీ ఆమెకు ‘రిటర్న్ గిఫ్ట్’గా రాజ్యసభ సీటు ఇప్పిస్తారేమో... చూడాలి. 

ఇక ఏపీలో చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావడం వలన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి ఉపశమనం కలుగుతుందనే భావించవచ్చు. 

ఒకవేళ మళ్ళీ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఆయన సాయంతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయాలని కేసీఆర్‌ కలలు కంటున్నారని గుసగుసలు వినిపించాయి. 

ఒకవేళ కేసీఆర్‌ కూల్చలేకపోయినా బీజేపీ నుంచి ప్రమాదం పొంచే ఉంది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో ఆగస్టులో సంక్షోభం ఏర్పడబోతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ముహూర్తం కూడా ప్రకటించేశారు. 

కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలకపాత్ర పోషిస్తుండటంతో మోడీ లేదా బీజేపీ నుంచి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి గండం ఏర్పడకుండా ఓ కాపు కాయగలరు. కనుక ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి చాలా ఉపశమనం కలిగించిందనే భావించవచ్చు. 

కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వలన సమస్యలు లేకపోతే రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ని అవలీలగా కట్టడి చేయగలరని వేరే చెప్పక్కరలేదు. 


Related Post