తెలంగాణ కాంగ్రెస్, బీజేపీలు అవునన్నా కాదన్నా ఓ విషయంలో సిఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకోవలసిందే. లేకుంటే నేడు అనేకమంది రాజకీయ నిరుద్యోగులుగా ఉండిపోయేవారు.
కానీ జిల్లాల పునర్విభజనతో బిఆర్ఎస్ పార్టీతో సహా రాష్ట్రంలో అన్ని పార్టీలకు భారీగా రాజకీయ ఉద్యోగాలు సృష్టించారు. పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా మార్చడంతో ఇప్పుడు జిల్లాకో అధ్యక్షుడు, కార్యదర్శి తదితర పదవులు ఏర్పడటంతో తెలంగాణలో రాజకీయ నిరుద్యోగం తగ్గింది.
దీనికంటే గొప్ప నిర్ణయం 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం. దాని వలన ఆ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలిచి మళ్ళీ అధికారంలోకి రాగలిగింది. కానీ ఆనాడు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం వలననే శాసనసభ ఎన్నికల నుంచి లోక్‌సభ ఎన్నికలను వేరయ్యాయి.
కనుక అప్పటి నుంచి శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినవారు వెంటనే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి గెలుస్తున్నారు. గత (2018) ఎన్నికలలో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రేవంత్ రెడ్డి వెంటనే మల్కాజ్‌గిరి నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచి ఎంపీ కాగలిగారు.
అదేవిదంగా ఈసారి శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ నేతలలో బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, డికె అరుణ తదితరులున్నారు.వీరందరూ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు.
అదే... ఆనాడు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళకపోయి ఉంటే నేటికీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతుండేవి. అప్పుడు వారందరికీ ఈ అవకాశం ఉండేదే కాదు. కనుక తమకు ఈ అవకాశం కల్పించిన కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ నేతలు కృతజ్ఞతలు తెలుపుకోవలసిందే.
అయితే కాంగ్రెస్, బీజేపీలకు ఇటువంటి గొప్ప అవకాశం, అదృష్టం కల్పించిన కేసీఆర్, లోక్‌సభ ఎన్నికలలో తమ సొంత పార్టీ నుంచి ఒక్కరినీ కూడా గెలిపించుకోలేకపోవడం మరో విశేషమే కదా?