ఏపీ, ఒడిశా శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దాదాపు అందరినీ ఆశ్చర్యపరిచాయి. కొన్ని పార్టీలకు ఊహించని షాకులు ఇచ్చాయి.
పదేళ్ళ బిఆర్ఎస్ పాలనలో పూర్తిగా నిర్వీర్యమైపోయి కుమ్ములాటలలో నిమగ్నమై ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకోవడమే చాలా ఆశ్చర్యం అనుకుంటే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వరుసగా విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈసారి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి 12కి పైగా సీట్లు వస్తాయని, బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని కేసీఆర్ జోస్యం చెపితే, బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుచుకోగా బిఆర్ఎస్ పార్టీయే తుడిచిపెట్టుకుపోవడం కేసీఆర్‌కు పెద్ద షాకే.
ఈసారి ఏపీ ఎన్నికలలో 175 శాసనసభ, 25 లోక్‌సభ సీట్లు మేమే గెలుచుకోబోతున్నామని ప్రగల్భాలు పలికిన వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డికి కేవలం 11/4 సీట్లే దక్కడంతో ఆయనకు, వైసీపి నేతలందరికీ పెద్ద షాకే.
గత ఎన్నికలలో 151 ఎమ్మెల్యే, 23 ఎంపీ సీట్లు గెలుచుకున్న జగన్, ఈసారి ఎన్నికలలో తాము ఎందుకు ఓడిపోయామో అర్దం కాలేదన్నారు.
ఈసారి లోక్‌సభ ఎన్నికలలో 400కి పైగా సీట్లు గెలుచుకుంటామని ప్రగల్భాలు పలికిన బీజేపీ అధిష్టానం చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు కేవలం 293 సీట్లు మాత్రమే గెలుచుకొని ఒడ్డున పడింది. ఏపీలో టిడిపి, జనసేన, మహారాష్ట్రలో శివసేన, బిహార్‌లో జేడీయూ తదితర ఎన్డీయే మిత్రపక్ష పార్టీల 52 సీట్లు కలిస్తేనే మోడీ మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతున్నారు. లేకుంటే ఓడిపోయిన్నట్లే.
ఈ ఎన్నికలలో అడ్రస్ లేకుండా పోతుందనుకున్న కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు గెలుచుకోగా ఇండియా కూటమి మొత్తం 232 సీట్లు గెలుచుకొని ఎన్డీయేకి ధీటుగా నిలబడటం విశేషమే.
ఒకవేళ ఎన్డీయే కూటమిలో నుంచి నితీష్ కుమార్ లేదా మరెవరైనా బయటకు వచ్చేస్తే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది.
ఒడిశాలో తిరుగే లేదనుకున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు తొలిసారిగా ఎదురుదెబ్బ తగిలి అధికారం కోల్పోగా, అక్కడ తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకాబోతోంది.
ఒడిశాలో గెలిచిన బీజేపీకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి తృణమూల్ కాంగ్రెస్ 29 ఎంపీ సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 12 మాత్రమే గెలుచుకోగలిగింది.
అధికారంలో ఉన్నంతకాలం మాకు తిరుగెలేదని అహంకారంతో విర్రవీగే పాలకులు అందరికీ ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కనువిప్పు కలిగించేవనే చెప్పవచ్చు. పదవి, అధికారం, ప్రభుత్వ యంత్రాంగం అన్నీ తమ చేతుల్లోనే ఉన్నా వాటన్నిటి కంటే అత్యంత శక్తివంతమైనది ప్రజాస్వామ్యం.. ప్రజల ఓట్లు అని మరోసారి అందరికీ ఈ ఎన్నికలు గుర్తుచేశాయని చెప్పవచ్చు.