ఈసారి శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అందరికీ పెద్ద షాకులే ఇచ్చాయని చెప్పవచ్చు. తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని కేసీఆర్ ప్రగల్భాలు పలికితే బీజేపీకి 8 సీట్లు రాగా బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాకపోవడం కేసీఆర్, కేటీఆర్‌లకు పెద్ద షాకే!
ఈ ఫలితాలు తనకు చాలా నిరాశ కలిగించాయని కేటీఆర్ అన్నారు. అయితే బిఆర్ఎస్ 24 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో అనేక విజయాలు సాధించిందన్నారు. అనేక సవాళ్ళు, ఎదురుదెబ్బలు ఎదుర్కొని నిలబడిందన్నారు.
తెలంగాణ సాధించిన అపూర్వమైన గౌరవం, విజయానికి మించింది మరేదీ లేదన్నారు. కనుక ఈ ఓటమితో బిఆర్ఎస్ పార్టీలో అందరూ నిరాశ చెందినప్పటికీ క్రుంగిపోవలసిన అవసరం లేదన్నారు. నిరంతరం ప్రజల పక్షాన్న నిలబడి పోరాడుతూ మళ్ళీ ఫీనిక్స్ పక్షిలా పైకి లేస్తామని కేటీఆర్ అన్నారు.
శాసనసభ ఎన్నికలలో ఓడిపోయినప్పుడే బిఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకుని తమ అహంకారం వలననే ఓడిపోయామని గుర్తించి ఆ లోపాన్ని సరిదిద్దుకుని ప్రజల వద్దకు వెళ్ళి ఉంటే బహుశః లోక్‌సభ ఎన్నికలలో ఇంత దారుణంగా ఓడిపోయేవారే కాదు.
కానీ ఓటమి తర్వాత ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ అహంభావంతో విర్రవీగినందునే ప్రజలు మరోసారి బిఆర్ఎస్ పార్టీని తిరస్కరించారని చెప్పక తప్పదు.
శాసనసభ ఎన్నికలలోనే కాంగ్రెస్, బీజేపీల వ్యూహాలతో తాము చిత్తుచిత్తుగా ఓడిపోయామని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులు గ్రహించి, అంగీకరించి మేలుకుని ఉండాలి. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎప్పటిలాగే మా అంత రాజకీయ మేధావులు మరెవరూ లేరన్నట్లు అహంకారంతో విర్రవీగారు.
లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాలేదని కేసీఆర్ చెప్పడమే బిఆర్ఎస్ అహంకారానికి నిదర్శనం.
ఈ అహంకారాన్నే తెలంగాణ ప్రజలు సహించడం లేదని గ్రహించకుండా ఈ ఫలితాలు తమని చాలా నిరాశ పరిచాయంటూ, ఓటమి తర్వాత ప్రతీ రాజకీయ నాయకుడు పలికే రొటీన్ చిలక పలుకులనే కేటీఆర్ కూడా వల్లెవేశారని చెప్పవచ్చు.
ఓటమికి కారణం తెలుస్తున్నా దానిని అంగీకరించకుండా కనీసం గుర్తించకుండా ఆత్మవంచన చేసుకుంటూ, కాంగ్రెస్, బీజేపీలను నిందించి ఏం ప్రయోజనం?