లక్షల కోట్లు పంచిపెట్టినా ఏపీలో జగన్‌ పార్టీ ఘోర పరాజయం

June 04, 2024


img


ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఈసారి టిడిపి, జనసేన, బీజేపీల చేతిలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఘోర’పరాజయం పాలైంది. గత (2019) ఎన్నికలలో వైసీపి 175 స్థానాలకు 151, 25 ఎంపీ సీట్లకు 23 గెలుచుకొని అనూహ్యమైన మెజార్టీతో అధికారంలో వచ్చింది. 

కానీ ఈ 5 ఏళ్ళలో అరాచక, అవినీతి పాలన సాగించడంతో సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు ప్రజలకు పంచిపెట్టిన్నప్పటికీ ఎన్నికలలో ప్రజలు ఆయనను, వైసీపిని తిరస్కరించారు. 

ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం టిడిపికి 66 సీట్లు గెలుచుకొని మరో 70 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, జనసేన 15 సీట్లు గెలుచుకొని మరో 6 సీట్లలో ఆధిక్యంలో ఉంది. వాటికి మిత్రపక్షమైన బీజేపీ 4 సీట్లు గెలుచుకొని మరో 4 సీట్లలో ఆధిక్యంలో ఉంది. 

మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో మూడు పార్టీలు కలిపి సుమారు 165 గెలుచుకోవడంతో వైసీపి కేవలం 10 సీట్లు మాత్రమే మిగిలాయి. గత ఎన్నికలలో 151 సీట్లు గెలుచుకున్న వైసీపి ఈసారి కేవలం 10 సీట్లకే పడిపోవడం గమనిస్తే ఆంధ్రా ప్రజలు జగన్‌ పాలనను ఎంతగా అసహ్యించుకున్నారో అర్దం చేసుకోవచ్చు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కనీసం రాజధాని నిర్మించాలనే స్పృహ కూడా ఆలేకుండా మూడు రాజధానులు అంటూ 5 ఏళ్ళు కాలక్షేపం చేయడం, అభివృధ్దిని విస్మరించి సంక్షేమ పధకాలతో ఓట్లు కొనుగోలు చేసి మళ్ళీ అధికారంలోకి రాగలమని అనుకోవడమే పెద్ద తప్పని రుజువైంది. దీనికి తోడు వైసీపిలో పై నుంచి క్రింద వరకు అందరూ అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, అప్పులతో రాష్ట్రాన్ని  సర్వనాశనం చేశారు. 

చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి అడ్డుతొలగించాలనుకోవడం, వైఎస్ షర్మిల హటాత్తుగా ఎన్నికలకు ముందు ఏపీలో ప్రవేశించి అన్న జగన్మోహన్‌ రెడ్డిని, ఆయన అసమర్ద, అవినీతి పాలనను ఎండగట్టడం వంటివి జగన్‌కు శాపాలుగా మారాయని చెప్పవచ్చు. 

ముఖ్యంగా టిడిపి, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేయడం వంటి అనేక కారణాలతో జగన్మోహన్‌ రెడ్డి ఘోరపరాజయం పాలయ్యారని చెప్పవచ్చు. 

జగన్‌ గెలవాలని, గెలిచి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూలద్రోయడంలో తనకు సాయపడాలని ఆశపడిన కేసీఆర్‌కు కూడా నిరాశే ఎదురైంది. ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు దక్కలేదు. 

కనుక రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూలద్రోయడం మాట అటుంచి ఇప్పుడు కాంగ్రెస్‌, బీజేపీలు బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేయకుండా కాపాడుకోవడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రెండున్నర నెలలుగా తిహార్ జైల్లో ఉన్న కూతురు కల్వకుంట్ల కవితని విడిపించుకోవడం కేసీఆర్‌ ముందున్న రెండు పెద్ద టాస్కులని చెప్పవచ్చు. 

ఏపీలో చంద్రబాబు నాయుడు, తెలంగాణ రేవంత్‌ రెడ్డి, కేంద్రంలో మళ్ళీ మోడీ అధికారంలోకి రావడం వలన ఏపీకి మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత మంచి సానుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు.  


Related Post