2024 నూతన సంవత్సర కానుకగా తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీని ఓడించగా, తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు పూర్తిచేసుకొని 11వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకున్నప్పుడే లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మరోసారి తిరస్కరించారు.
ఎన్నికల ప్రచార సమయంలో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రంలో మోడీ పాలనతో దేశ ప్రజలు, తెలంగాణలో కాంగ్రెస్ పాలనతో రాష్ట్ర ప్రజలు చాలా విసుగెత్తిపోయి ఉన్నారు. ఈసారి ఎన్డీయే కూటమి 200 సీట్లు కూడా రావు. అలాగే ఇండియా కూటమి కూడా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. కనుక బిఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలు కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వాటికి కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతు ఈయక తప్పదు,” అని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 4-5 సీట్లు రావచ్చని, బీజేపీకి ‘వన్ ఆర్ నన్’ (ఒకటి లేదా సున్నా) సీట్లు వస్తాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. కానీ ఎప్పటిలాగే ఆయన జోస్యం ఫలించలేదు. కేంద్రంలో మళ్ళీ 300 సీట్లు గెలుచుకొని మళ్ళీ మోడీ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతోంది.
తెలంగాణలో బీజేపీకి ‘వన్ ఆర్ నన్’ అని కేసీఆర్ జోస్యం చెప్పగా ఆ జోస్యం బిఆర్ఎస్ పార్టీకే వర్తించబోతోంది. కాంగ్రెస్, బీజేపీలు చెరో 8 ఎంపీ సీట్లు గెలుచుకోబోతుంటే, బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు గెలుచుకునే అవకాశం కనిపించడం లేదు. మిగిలిన ఒక్క సీటుని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గెలుచుకోబోతున్నారు.
లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఈ ఓటమి శాసనసభ ఎన్నికల కంటే చాలా దారుణంగా ఉంది. అంటే శాసనసభ ఎన్నికల తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల తీరు మార్చుకోకపోవడాన్ని ప్రజలు తప్పుపట్టిన్నట్లే అనుకోవచ్చు లేదా కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి, బీజేపీ నేతలు గొప్పగా వ్యూహ రచన చేశారని భావించవచ్చు.
ఏది ఏమైనప్పటికీ, కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీకి ఇది కోలుకోలేని పెద్ద ఎదురుదెబ్బే. కనుక బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వంపై తిరుగుబాటు గళాలు వినిపించవచ్చు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీలలోకి క్యూకట్టి వెళ్లిపోవచ్చు. కనుక బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉంది.