కేసీఆర్ ప్రభుత్వం ఐపిఎస్ అధికారిగా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేసీఆర్ నియంతృత్వ పోకడలను వ్యతిరేకిస్తూ బీఎస్పీలో చేరి శాసనసభ ఎన్నికలలో పోటీ చేశారు. కానీ ఆయనతో సహా ఆ పార్టీ అభ్యర్ధులు అందరూ ఎన్నికలలో ఓడిపోయారు.
ఆ తర్వాత వెంటనే వస్తున్న లోక్‌సభ ఎన్నికలలో అదే కేసీఆర్, బిఆర్ఎస్‌తో పొత్తుకి సిద్దమైనప్పుడు అందరూ ఆయన తీరుని తప్పు పట్టారు.
దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడుదామని చెప్పి ఎన్నికలలో ఓడిపోగానే అదే దొరతో దోస్తీకి సిద్దమయ్యారని సర్వత్ర విమర్శలు వచ్చాయి.
అప్పుడైనా ఆయన వెనక్కు తగ్గి ఉండి ఉంటే గౌరవంగా ఉండేది కానీ కేసీఆర్ సూచన మేరకు లోక్‌సభ సీటు కోసం బీఎస్పీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరడం తమని వంచించడంగానే బడుగు బలహీన వర్గాల ప్రజలు, ముఖ్యంగా దళితులు భావించారు.
అందుకు వారు లోక్‌సభ ఎన్నికలలో ఆయనకు గుణపాఠం చెపుతున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన మల్లు రాష్ట్రవ్యాప్తంగా 18,655 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కనుక లోక్‌సభ సీటు కోసం కక్కుర్తిపడి బడుగు బలహీన వర్గాల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరడం తప్పని ఈపాటికి ప్రవీణ్ కుమార్‌కి అర్దమయ్యే ఉండాలి.
సిఎం రేవంత్ రెడ్డి ఆయనకు టిఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవి ఆఫర్ చేసినప్పుడు దానిని అంగీకరించి ఉన్నా నేడు ప్రవీణ్ కుమార్‌కు ఇంత అవమానం ఎదురయ్యేది కాదు. ఈ ఎన్నికలలో ప్రవీణ్ కుమార్ ఓడిపోతే కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్‌లో ఎవరూ పట్టించుకోకపోవచ్చు.
ఈ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయడానికి కాంగ్రెస్, బీజేపీలు కాసుకు కూర్చున్నాయి. కనుక దానిలో ప్రవీణ్ కుమార్ కొనసాగడం వల్ల ఉపయోగం ఉండదు. కాంగ్రెస్, బీజేపీలు ఆయనను చేర్చుకునే అవకాశమే లేదు. కనుక ప్రవీణ్ కుమార్ బీఎస్పీని వీడి తన రాజకీయ జీవితానికి తానే సమాధి కట్టుకున్నారని చెప్పవచ్చు.