ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఊహించని ట్విస్ట్

June 04, 2024


img

సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్‌ కేసుని తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ వ్యవహారంలో పలువురు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగిన్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను పరిశీలించిన హైకోర్టు, వాటిని నిర్ధారించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 

దీనిపై జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టబోతోంది.    

ఈ కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్‌డి రాధాకిషన్ రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, ఎస్పీ భుజంగరావు సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తాము బిఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు ప్రతిపక్ష నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పలువురు ప్రముఖులు, న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసి సమాచారం సేకరిస్తుండేవారిమని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం మేరకే తాము ఫోన్ ట్యాపింగ్‌ చేశామని వారు పేర్కొన్నట్లు పత్రికలలో వార్తలు వచ్చాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు సుమోటో కేసుగా స్వీకరించి నేడు విచారణ జరుపబోతోంది.    

ఈ కేసులో నేరుగా హైకోర్టు జోక్యం చేసుకొని విచారణ చేపట్టడం కీలక పరిణామమే అని భావించవచ్చు.

రాజకీయ కారణాలు, లెక్కలు, అవసరాలు, ఒత్తిళ్ళ కారణంగా ఈ కేసులో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తాత్సారం చేస్తున్నా, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని ఉపేక్షిస్తున్నా, ఇప్పుడు హైకోర్టు జోక్యం చేసుకోవడంతో కేసు విచారణ వేగవంతం అయ్యే అవకాశం ఉంది. లేదా ఈ కేసు విచారణని సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశించే అవకాశం ఉంది. ఈ రెంటిలో ఏది జరిగినా కేసీఆర్‌ మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమే. 


Related Post