తెలంగాణ ఏర్పడి పదేళ్ళవుతున్నా ఇంతవరకు జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో జనగణమన తప్ప ఈ గీతం ఎన్నడూ ఆలపించలేదు. కానీ నేడు తెలంగాణ దశాబ్ధి వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభదినంనాడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘జయ జయ హే...’ ఈ గీతాన్ని విడుదల చేశారు. తెలంగాణవాదులు అందరూ ఇందుకు పులకించిపోకుండా ఉండగలరా?
సుమారు రెండు దశాబ్ధాల క్రితమే అందెశ్రీ ఈ అద్భుతమైన ఆ గీతాన్ని వ్రాశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అది ఎంతో మందిని ఉత్తేజపరిచింది. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యమకారుడైన కేసీఆర్ దానిని పట్టించుకోలేదు.
మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత సిఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని, 13 నిమిషాల నిడివితో పూర్తి గేయాన్ని, దానిలో మూడు చరణాలను తీసుకొని ఇటువంటి అధికారిక కార్యక్రమాలలో, విద్యాసంస్థలలో పాడుకునేందుకు వీలుగా రెండున్నర నిమిషాల నిడివితో మరో చిన్న గీతాన్ని సంగీత దర్శకుడు కీరవాణి చేత స్వరపరిపించి అందరికీ అందుబాటులో తీసుకువచ్చారు.
ఏపీకి చెందిన కీరవాణి చేత స్వరపరచడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ సంగీతానికి ప్రాంతీయవాదం అంటించడం సరికాదనే వాదనలే చివరికి నెగ్గాయి. ఇన్నేళ్ళకు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సగర్వంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో పాడుకోగలిగాము.