తెలంగాణలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగిన ఈసారి బిఆర్ఎస్ పార్టీయే ఎక్కువ సీట్లు గెలుచుకోబోతోందని, కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క సీటు కూడా రాకుండా తుడిచిపెట్టుకుపోతాయని కేసీఆర్ చెపుతుంటారు.
శాసనసభ ఎన్నికలలోనూ ఇలాగే చెప్పారు... ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలోనూ ఇలాగే చెప్పారు. కానీ ప్రతీసారి ఆయన లెక్క తప్పుతూనే ఉంది. శాసనసభ ఎన్నికలలో 100కి పైగా సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పుకోగా 39 సీట్లు మాత్రమే గెలుచుకొని ఎన్నికలలో ఓడిపోయారు.
లోక్‌సభ ఎన్నికలలో 17 సీట్లలో బిఆర్ఎస్ పార్టీ 10 కంటే ఎక్కువే సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. మిగిలిన సీట్లు కాంగ్రెస్‌కు దక్కవచ్చని, బీజేపీకి ‘వన్ ఆర్ నన్’ (ఒకటి లేదా సున్నా) మాత్రమే దక్కుతాయని కేసీఆర్ జోస్యం చెప్పారు.
కానీ దాదాపు 10 మీడియా సంస్థలు నిన్న సాయంత్రం ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్, బీజేపీలు చెరో 7- 9 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తేల్చి చెప్పాయి. కానీ అన్ని సంస్థలు బిఆర్ఎస్ పార్టీ 2-3 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని తేల్చి చెప్పాయి.
లోక్‌సభ ఎన్నికలు జరిగిన ప్రతీసారి కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతానని చెపుతుంటారు. ఈసారి బీజేపీ, కాంగ్రెస్ రెండు కూటములకి తగినంత మెజార్టీ రాదని, అప్పుడు బిఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని వాటికి కాంగ్రెస్, బీజేపీ కూటమి మద్దతు ఈయక తప్పదని కేసీఆర్ జోస్యం చెప్పారు.
కానీ ఎగ్జిట్ పోల్స్‌లో మళ్ళీ మోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వమే పూర్తి మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి రాబోతోందని తేల్చి చెప్పాయి. అంటే ఈసారి కూడా కేసీఆర్ లెక్క తప్పిందన్న మాట. ఈవిదంగా ప్రతీసారి ఎన్నికలకు ముందు మనమే గెలుస్తున్నాం... కేంద్రంలో నేనే చక్రం తిప్పుతానంటూ కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటారు. కానీ కేసీఆర్ లెక్కలు కాకి లెక్కలని రుజువు అవుతున్నప్పుడు జోస్యం చెప్పడం దేనికి?ఆనక నవ్వులపాలు కావడం దేనికి?