హమ్మయ్య... మోడీ ధ్యానం ముగిసింది!

June 01, 2024


img

ప్రపంచంలో కెల్లా ‘అత్యంత ఖరీదైన ధ్యానం’ ఈరోజు కన్యాకుమారిలో ముగిసింది. ఖరీదైన ధ్యానం ఎందువల్ల అంటే స్వామి వివేకానంద స్మారక మందిరంలో ప్రధాని నరేంద్రమోడీ గురువారం సాయంత్రం నుంచి 45 గంటల పాటు ఏకధాటిగా ధ్యానం చేస్తుంటే, చుట్టూ సముద్రంలో మరబోట్లపై నావికాదళానికి చెందిన జవాన్లు గస్తీ కాశారు. అలాగే ఆకాశం నుంచి ఎవరూ దాడి చేయకుండా 45 గంటల సేపు హెలికాఫ్టర్లలో పహరా కాస్తూ ప్రధాని నరేంద్రమోడీకి భద్రత కల్పించారు. 

ఇక ప్రధాని మోడీ పర్యటనకు రెండు రోజుల ముందే ఆయన భద్రతా సిబ్బంది కన్యాకుమారిలో మోహరించి పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకొని అణువణువు గాలించి ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలోనే వచ్చి వెళతారని అందరికీ తెలుసు. ఇన్ని ఏర్పాట్లు, ఇంత మందితో భద్రత, ప్రత్యేకవిమానంలో రాకపోకలు అన్నిటికి అయిన ఖర్చు లెక్కేసుకుంటే తక్కువలో తక్కువ రూ. 20-30 కోట్లు అయినా ఉంటుంది. అంతకంటే ఎక్కువే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు. 

ప్రధాని నరేంద్రమోడీ సర్వసంగా పరిత్యాగిలా కాషాయ వస్త్రాలు ధరించి చాలా నిరాడంబరంగానే ధ్యానం చేసుకున్నప్పటికీ, అది అత్యంత ఖరీదైన ధ్యానమనే చెప్పాలి. 

గురువారం సాయంత్రం నుంచి 45 గంటల సేపు ప్రధాని నరేంద్రమోడీ ఏకాంతంగా ధ్యానం చేసి శనివారం మధ్యాహ్నం ముగించారు. అనంతరం సూర్యుడికి అర్ఘ్యం వదిలారు. తర్వాత పక్కనే సముద్రంలో మరో చిన్న రాతికొండపై ఏర్పాటు చేసిన 133 అడుగుల ఎత్తైన ప్రముఖ తమిళ కవి, తత్వవేత్త తిరువళ్ళువర్ విగ్రహానికి మోడీ పూలమాల అర్పించి, పటిష్టమైన భద్రత నడుమ పడవలో కన్యాకుమారి తీరానికి చేరుకున్నారు. 



Related Post