మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడిన పదేళ్ళకు కేసీఆర్ కుటుంబం నుంచి రాష్ట్ర ప్రజలకు కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి లభించినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ దశాబ్ధి ఉత్సవ వేడుకలు మా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరుగబోతున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది.
తెలంగాణ ఏర్పాటుకు ఎంతో సాయపడిన సోనియమ్మని కూడా ఆహ్వానించాము. కానీ ఆమె ఆరోగ్యం బాగోకపోవడం వలన రాలేకపోవచ్చని తెలిసింది. ఆమె కూడా ఈ వేడుకలలో పాల్గొని ఉంటే నిండుదనం వచ్చేది. రేపు జరుగబోయే ఈ వేడుకలకు రాష్ట్రంలో అన్ని పార్టీలను, ఉద్యమ నేతలను, ప్రముఖులను ఆహ్వానించాము.
గత పదేళ్ళలో నియంతృత్వ పాలన సాగించిన కేసీఆర్ ఏనాడూ మమ్మల్ని ఏ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. కానీ మేము అందరినీ ఆహ్వానించి అందరితో కలిసి ఈ వేడుకలు జరుపుకోవాలని కోరుకుతున్నాము. అదే మాకు ఆయనకు గల తేడా. రేపు జరుగబోయే వేడుకలలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ నిర్వహిస్తాము,” అని అన్నారు.