పదేళ్ళ తర్వాత క్రెడిట్ కోసం కొట్లాటలా... హవ్వ!

May 31, 2024


img

జూన్ 2కి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు అవుతుంది. అయినా ఇంకా తెలంగాణ మా వల్లనే ఏర్పడిందంటూ కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు కీచులాడుకుంటుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిధిగా ఆహ్వానించి, తెలంగాణ ఇచ్చినందుకు ఆమెకు ఘనంగా సన్మానించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. 

ఆనాడు ఆమె చొరవ తీసుకొబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సిఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు, నేతలు పదేపదే చెప్పుకుంటున్నారు. కనుక శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో తమని గెలిపించి ఆమె రుణం తీర్చుకోవాలని వారు కోరడం అందరూ విన్నారు. 

ఇప్పుడు దశాబ్ధి వేడుకల సమయంలో వారే రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున సోనియా గాంధీని సన్మానించి, ఆమె వల్లనే తెలంగాణ ఏర్పడిందని తెలంగాణ ప్రజలకు గుర్తుచేయాలని అనుకుంటున్నారు.

అయితే 1952 నుంచి తెలంగాణ 2014 వరకు తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాలలో వేలాదిమంది అమరులు అయ్యారని అందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అలసత్వమే కారణం కాదా?2004లో మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరు?” అంటూ బిఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌లో కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నలు సందించారు.

తెలంగాణ సాధనలో వేలాది మంది చనిపోయారని కేటీఆర్‌ చెపుతున్నారు. కానీ కేసీఆర్‌కి ప్రజలు అధికారం అప్పగిస్తే కనీసం అమర వీరులందరినీ గుర్తించడానికి కూడా ఇష్టపడలేదు. 4-500 మందిని మాత్రమే గుర్తించి వారి కుటుంబాలకు మాత్రమే కొద్దిగా సాయపడ్డారు. 

కేసీఆర్‌ పదేళ్ళ పాలనలో ఉద్యమకారులను సముచిత గౌరవం ఇవ్వనే లేదు. శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత వారందరినీ దూరం చేసుకున్నామని కేటీఆర్‌ స్వయంగా చెప్పుకున్నారు. తెలంగాణ కోసం పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న అమరవీరులను గుర్తించడానికి ఇష్టపడని కేసీఆర్‌ని కాంగ్రెస్‌ మాత్రం ఎందుకు గుర్తించాలి? కాంగ్రెస్ పార్టీకి ఆ అవసరం ఏమిటి? అని కేటీఆర్‌ ఆలోచిస్తే బాగుంటుంది.

 



Related Post