జూన్ 2వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో పాల్గొనవలసిందిగా కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ వ్రాశారు.
అయితే ఆ కార్యక్రమానికి హాజరయ్యే ఉద్దేశ్యం లేదని ముందే స్పష్టం చేశారు. ఒకరోజు ముందుగానే బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా సోనియా గాంధీ పాల్గొనబోతున్నారు. ఆమె వలననే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే బలమైన సందేశం ప్రజలకు పంపబోతోంది.
కానీ తన పోరాటాల వలననే తెలంగాణ ఏర్పడిడిందని కేసీఆర్, బిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. గత పదేళ్లుగా వారు ఈ విషయం ప్రజలకు చేర్చడంలో సఫలం అయ్యారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ క్రెడిట్ సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తూనే, తెలంగాణపై కేసీఆర్ ముద్రలు చెరిపేయాలని కూడా ప్రయత్నిస్తోంది.
బిఆర్ఎస్ పార్టీకి ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాబోదు. పైగా దాని అస్తిత్వానికి మూలమే కేసీఆర్, తెలంగాణ అనే రెండు పదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటినే దెబ్బతీయాలని ప్రయత్నిస్తోందని బిఆర్ఎస్ గ్రహించింది కనుక ధీటుగానే పోరాడుతోంది. తెలంగాణలో సాగుతున్న ఈ రాజకీయ ఆధిపత్యపోరులో చివరికి ఏ పార్టీ పైచేయి సాధిస్తుందో?