తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే పోలీస్ శాఖలో అనూహ్యమైన పరిణామాలు జరుగుతున్నాయి. పలువురు పోలీస్ అధికారులను, మాజీ అధికారులను వివిద కేసులలో పోలీస్ అధికారులే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. జైలుకి పంపిస్తున్నారు. కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్‌డి రాధాకిషన్ రావు, ఎస్పీ భుజంగరావు, తిరుపతన్నలను పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపగా, సిట్ బృందం వారిని విచారిస్తోంది.
ఇంకా అమెరికాలో ఉన్న స్పెషల్ ఇంటలిజన్స్ మాజీ అధిపతి ప్రభాకర్ రావుని కూడా ఇదే కేసులో అరెస్ట్ చేసేందుకు నాంపల్లి కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్ జారీ చేయించి ఆయన కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ కేసు విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ పోలీస్ శాఖలోని మరింత మంది పేర్లు బయటపడే అవకాశం కనిపిస్తోంది.
అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ ఉమామహేశ్వర రావు నివాసంలో ఈ నెల 22న అవినీతి నిరోదకశాఖ అధికారులు సోదాలు జరిపి రూ.3.95 కోట్లు అక్రమస్తులను గుర్తించడంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు ఉమామహేశ్వర రావుని తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.