ఢిల్లీ హైకోర్టులో నేడు కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడీ, సీబీఐలు వేర్వేరుగా తమ వాదనలు వినిపించాయి. ఈడీ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ, “ఈ లిక్కర్ స్కామ్ గురించి నాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌కు ముందే తెలుసు.
ఢిల్లీలోని తన అధికార నివాసంలోనే ఈ మద్యం కుంభకోణంలో పాత్రదారులైన అభిషేక్, అరుణ్ పిళ్లై లు అందరినీ కల్వకుంట్ల కవిత ఆయనకు పరిచయం చేశారు. వారిలో ఆమె ఆడిటర్ బుచ్చిబాబు కూడా ఉన్నారు.
వారి ద్వారానే కేసీఆర్ ఈ వ్యవహారం ఏవిదంగా సాగబోతోందో అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన గోపీ కుమారన్ ఇచ్చిన వాంగ్మూలంలో కేసీఆర్‌తో జరిగిన ఈ సమావేశం గురించి పేరొన్నారు.
ఈ వ్యవహారం మొదలైనప్పటి నుంచి కల్వకుంట్ల కవిత మొత్తం 11 మొబైల్ ఫోన్లు మార్చారు. వాటిలో 4 ఫోన్లలో డేటా దొరక్కుండా ధ్వంసం చేశారు. ఈ కేసు నుంచి బయట పడేందుకు ఆమె తప్పకుండా సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తారు కనుక బెయిల్ మంజూరు చేయరాదని ఈడీ తరపు న్యాయవాది వాదించారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు ముగియడంతో జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పుని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇంతవరకు ఈ కేసులో కల్వకుంట్ల కవితతో సహా ఇతరుల పేర్లు వినిపించాయి కానీ తొలిసారిగా నేడు కేసీఆర్ పేరు కూడా వినిపించడంతో ఈ కేసు కూడా ఆయన మెడకు చుట్టుకునే ప్రమాదం పొంచి ఉందనే భావించవచ్చు.
ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండగా ఈ మద్యం కుంభకోణం గురించి నిందితులతో చర్చించడం, పూర్తి వివరాలు తెలిసినా వాటిని దాచిపెట్టడం, కూతురు కల్వకుంట్ల కవిత అరెస్టుకి ప్రధాని నరేంద్రమోడీయే కారణం అంటూ తప్పు పట్టడం వంటివన్నీ నేరాలుగానే పరిగణింపబడతాయి.
కానీ రాజకీయ శతృత్వంతో ఇటువంటి కేసులన్నీ మరింత బిగుసుకున్నట్లే, రాజకీయ మిత్రత్వంతో అటకెక్కిపోవచ్చు కూడా. కనుక ఈ కేసు, విచారణ కొనసాగుతూనే ఉంటుంది తప్ప ఎవరికీ శిక్షలు పడే అవకాశం కూడా ఉండకపోవచ్చు.