తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్ళు పూర్తయినందున రాష్ట్ర ప్రభుత్వం ఈసారి జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించి ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే ఈ వేడుకలకు ప్రతిపక్ష పార్టీలను, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నవారిని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. బిఆర్ఎస్ పార్టీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపబోతోంది.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ చొరవ తీసుకుని తెలంగాణ ఏర్పాటు చేయించినందున ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా ఆమెను ఆహ్వానించి ఘనంగా సన్మానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తమ పార్టీ అధ్వర్యంలో వేరేగా వేడుకలు నిర్వహించుకోవాలని నిర్ణయించి వాటి కోసం మూడు రోజుల షెడ్యూల్ కూడా ప్రకటించారు.
జూన్ 1: సాయంత్రం గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి ట్యాంక్ బండ్ వద్ద అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ.
జూన్ 2: హైదరాబాద్, తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది వేడుకలు. పార్టీ క్యాడర్ని ఉద్దేశ్యించి కేసీఆర్ ప్రసంగిస్తారు. నగరంలో ఆసుపత్రులు, అనాధ శరణాలయాలలో పళ్ళు, మిటాయిలు పంపిణీ.
జూన్ 3: దశబ్ధి ఉత్సవాల ముగింపు అన్ని జిల్లాలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాల వద్ద జాతీయ జెండా, పార్టీ జెండాలు ఎగురవేసి వేడుకలు నిర్వహిస్తారు.
రాష్ట్ర (కాంగ్రెస్) ప్రభుత్వం నిర్వహించే వేడుకలలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ వలననే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గట్టిగా నొక్కి చెపుతారు. కానీ కేసీఆర్ పోరాటాల వలననే తెలంగాణ ఏర్పడిందని బిఆర్ఎస్ భావిస్తోంది కనుక అదే విషయం మరోసారి ప్రజలకు చెప్పుకునేందుకు ఈ మూడు రోజుల వేడుకలు జరుపేందుకు సిద్దం అయిన్నట్లు భావించవచ్చు.
ముఖ్యంగా శాసనసభ ఎన్నికలలో ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. కనుక ప్రజలలోకి వెళ్ళేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని బిఆర్ఎస్ పార్టీకి మాత్రమే తెలంగాణతో బలమైన అనుబంధం ఉందని, తాము మాత్రమే రాష్ట్రాన్ని కాపాడగలమని కేసీఆర్ చెప్పబోతున్నారు.