తెలంగాణలో సన్న రాజకీయాలు

May 26, 2024


img

సన్నరకం బియ్యమే ఇప్పుడు అందరూ ఇష్టంగా తింటున్నారు. అయితే ఈ సన్న బియ్యం పంట చేతికి వచ్చిన ప్రతీసారి వాటిపై కూడా తెలంగాణలో రాజకీయాలు జరుగుతుండటం పరిపాటిగా మారిపోయింది. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దుడ్డు బియ్యం వద్దు సన్నాలే కావాలని చెపితే దానిపై బిఆర్ఎస్ మంత్రులు, నేతలు ఎంత హడావుడి చేశారో అందరూ చూశారు. 

ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య మళ్ళీ సన్న బియ్యం-రాజకీయాలు మొదలయ్యాయి. సన్న బియ్యానికి మాత్రమే రూ.500 బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం దుడ్డు బియ్యం పండించే రైతులను మోసం చేయడమే అంటూ కేటీఆర్‌, హరీష్ రావులు సన్నగా యుద్ధం ప్రారంభించారు. ఇప్పుడు బీజేపీ కూడా వారితో రాగం కలుపుతూ, ఉత్తమ్ కుమార్‌ రెడ్డి మిల్లర్ల నుంచి వెయ్యి కోట్లు లంచం తీసుకున్నారని తీవ్ర ఆరోపణ చేసింది. 

ఈ ఆరోపణలపై ఆయన స్పందిస్తూ, “బిఆర్ఎస్‌ హయాంలో రైతులు మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తే వారితో భూములు సెటిల్ మెంట్స్ మాట్లాడిన్నట్లు మేము మాట్లాడటం లేదు. మిల్లర్లలో కొంత మంది అటు రైతులను, ఇటు ప్రభుత్వాన్ని కూడా మోసం చేశారు. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే బిఆర్ఎస్‌, బీజేపీ నేతలే అడ్డుపడుతూ, మళ్ళీ మేమే మిల్లర్లతో కుమ్మకు అయ్యామని మాపై ఆరోపణలు చేస్తుండటం సిగ్గు చేటు. 

నేను ఇంతవరకు మిల్లర్లను కలవలేదు. ఎవరితో మాట్లాడలేదు కూడా. నాపై ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోను. మా ప్రభుత్వాన్ని ఏదో ఓ విధంగా ఇబ్బంది పెడుతూ, మాపై బురద జల్లడానికే బీజేపీ, బిఆర్ఎస్‌లు కుమ్మక్కు అయ్యాయి. 

రైతులు ఎంత సన్నబియ్యం పండిస్తే అంతా వారి నుంచి కేజీ రూ.42 చొప్పున        కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. పదేళ్ళ బిఆర్ఎస్‌ హయాంలో పౌరసరఫరాల శాఖ పరిస్థితి దయనీయంగా మారింది. బిఆర్ఎస్‌ ప్రభుత్వం దానిని ఇష్టం వచ్చిన్నట్లు వాడుకున్నారే కానీ కాపాడుకోవాలని ప్రయత్నించలేదు. ప్రస్తుతం అది రూ.11,000 కోట్ల నష్టాలలో ఉంది. 

మహేశ్వర్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీయే పామూకీ పాలు పోసి పెంచిన్నట్లు పెంచింది. అందుకే ఇప్పుడు ఆయన మమ్మల్నే కాటేస్తున్నారు. ఆయన కిషన్ రెడ్డి స్థానం ఆక్రమించాలనే ఇలా అతిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఫ్లోర్ లీడర్ పదవి ఎలా వచ్చిందో బీజేపీలో అందరికీ తెలుసు,” అని ఉత్తమ్ కుమార్‌ రెడ్డి అన్నారు.


Related Post