ఉమ్మడి వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబందించి సోమవారం పోలింగ్ జరుగబోతోంది. ఈ మూడు జిల్లాలో కలిపి మొత్తం 4,63,839 పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. శాసనసభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియకు పూర్తి భిన్నంగా ఈ ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. కనుక రేపు ఓట్లు వేయబోయే పట్టభద్రులు అందరూ ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం.
1. ఈ పోలింగ్ ప్రక్రియలో ఈవీఎంలు ఉండవు. బ్యాలట్ పేపర్లు మాత్రమే ఉంటాయి.
2. పార్టీల ఎన్నికల గుర్తులు కూడా ఉండవు. పోటీ చేస్తున్న అభ్యర్ధుల ఫోటోలు, వారి పేర్లు మాత్రమే ఉంటాయి.
3. అభ్యర్ధుల పేర్ల పక్కన చిన్న బాక్సులు ముద్రించి ఉంటాయి.
4. పోలింగ్ బూత్‌లోని రిటర్నింగ్ అధికారులు ఇచ్చే పెన్నుని మాత్రమే వాడాలి. సొంత పెన్ను, పెన్సిల్ మరి దేనితో వేసినా ఆ ఓటు చెల్లదు.
5. ఆ బాక్సులలో తమకు నచ్చిన అభ్యర్ధులకు ప్రాధాన్యతా క్రమంలో 1,2,3,4,5 నంబర్లు రాయాలి. ఉదాహరణకు జాబితాలో ఏడవ అభ్యర్ధికి ఓటు వేయాలనుకుంటే పక్కనే ఉన్న బాక్సులో 1 (అంకె మాత్రమే) రాయాలి. ఆ తర్వాత జాబితాలో పైన ఉన్న మొదటి అభ్యర్ధికి రెండో ఓటు వేయాలనుకుంటే, పక్కనే బాక్సులో (2) అని రాయాలి. అలాగే జాబితాలు ఉన్న మిగిలిన వారికి ఓట్లు వేయాలనుకుంటే వారి పేర్ల పక్కన గల బాక్సులలో ఇలా 3,4,5,6 అంకెలు రాయాల్సి ఉంటుంది.
6. జాబితాలో ఒక్కొక్కరికీ 1, 2,3,4,5 అని వ్రాసిన తర్వాత మళ్ళీ వేరొకరికి అదే అంకె వ్రాస్తే ఆ ఓటు చెల్లకుండా పోతుంది. అలాగే ప్రాధాన్యతా క్రమంలో మొదటి ఓటు (1) వేయకుండా 2,3,4,5 వేసినా ఆ ఓట్లు చెల్లవు
7. ఇంగ్లీష్ అంకెలు అంటే 1, 2,3,4,5 మొదలైనవి లేదా రోమన్ అంకెలు వేయవచ్చు. కానీ మరే భాషలో వ్రాసిన ఓట్లు చెల్లవు. బ్యాలట్ పేపర్లో ఇంగ్లీషు అంకెతో మొదలుపెడితే మిగిలినవి కూడా ఇంగ్లీషు అంకెలే వ్రాయాలి తప్ప మద్యలో రోమన్ అంకెలను వ్రాస్తే ఆ ఓట్లు చెల్లవు.
8. పోలింగ్ బూత్‌లకు తప్పనిసరిగా మీ ఓటరు, ఆధార్ లేదా మరేదైనా గుర్తింపు కార్డు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది.
గత (2021) ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ పద్దతిలో ఓట్లు వేయకపోవడం వలన 20,000 ఓట్లు చెల్లకుండా పోయాయి. కనుక రేపు ఓట్లు వేయబోయే ఓటర్లు అందరూ ఈ పద్దతి గురించి అవగాహన ఏర్పరచుకొని ఓటు హక్కు వినియోగించుకోవడం మంచిది.