తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా అధికారం చేపట్టిన బిఆర్ఎస్ ప్రభుత్వం 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేందుకు జోనల్ వ్యవస్థని రూపొందించి అమలుచేసింది. పదేళ్ళ పాలనలో 2,32,308 ఉద్యోగాల భర్తీకి అనుమతించామని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు.
కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అబద్దాలు చెపుతోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఈ ప్రక్రియని అంతా పూర్తిచేస్తే, సిఎం రేవంత్ రెడ్డి వారికి నియామక పత్రాలు అందించి, తామే ఆ ఉద్యోగాలు భర్తీ చేశామన్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని, ఇది రాజకీయ దివాళాకోరుతనమే అని కేటీఆర్ ఆక్షేపించారు. తెలంగాణలో కంటే దేశంలో మరే రాష్ట్రంలోనైనా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన్నట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాలు విసిరారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాలలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి. ప్రతీ ప్రభుత్వం తమ హయాంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేస్తూనే ఉంది. వాటి కోసం నోటిఫికేషన్ ఇవ్వడం, పరీక్షల నిర్వహణ, ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తూనే ఉంటాయి.
ఇది ఓ నిరంతరంగా సాగే ప్రక్రియ. ఒక ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ ప్రక్రియను తర్వాత ప్రభుత్వం పూర్తి చేస్తుంటుంది. ప్రస్తుతం తెలంగాణలో కూడా ఇదే జరుగుతోంది. తెలంగాణలో మాత్రమే కాదు ఏ రాష్ట్రంలోనైనా ఇలాగే సాగుతుంది. కానీ ఇది అన్యాయం, అక్రమం అని కేటీఆర్ వితండవాదన చేస్తున్నారు.
తెలంగాణలో తొలిసారి బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఉద్యోగాల భర్తీ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ టిఎస్‌పీఎస్సీ ఏర్పాటు, జోనల్ వ్యవస్థ రూపొందించడం, దానికి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకోవడం, ఆ ప్రకారం ఖాళీలు గుర్తించి నోటిఫికేషన్స్ జారీ చేయడంలో ఆలస్యం జరిగింది. దానిని ఎవరూ తప్పుపట్టలేరు.
కనుక బిఆర్ఎస్ రెండోసారి రాష్ట్రంలో అధికారంలో వచ్చినప్పుడైనా వేగంగా ఉద్యోగాల భర్తీ చేసి ఉండి ఉంటే నేడు కేటీఆర్ ఇలా బాధపడాల్సిన అవసరమే ఉండేది కాదు. ఆ 30 వేల ఉద్యోగాల భర్తీ క్రెడిట్ కూడా ఆయనకు, బిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కి ఉండేది.
కానీ కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలు, ఓట్ల కూడికలు, తీసివేతలు, లాభనష్టాలు అన్నీ సరిచూసుకుంటూ ఉద్యోగాల భర్తీ చాలా ఆలస్యం చేసింది. మద్యలో టిఎస్‌పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం, పరీక్షలు వాయిదాలు, రద్దులు, శాసనసభ ఎన్నికలతో మళ్ళీ వాయిదాలతో ఈ ప్రక్రియ సుదీర్గంగా సాగుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతిలోకి వచ్చిందిప్పుడు.
కనుక దానిని ఆయన కొనసాగిస్తూ, తన హయాంలో భర్తీ అయిన ఉద్యోగాలు ఇన్ని అని చెప్పుకుంటున్నారు. అందుకు కేటీఆర్ అసూయ పడనవసరమే లేదు. పడాలనుకుంటే ఇంకా ఫ్లైఓవర్లు, రోడ్లు, అనేక భవనాల ప్రారంభోత్సవాలు చాలానే ఉన్నాయి. వాటి శిలాఫలకాలపై సిఎం రేవంత్ రెడ్డి మంత్రుల పేర్లే వేసుకుంటారు కానీ కేసీఆర్, కేటీఆర్ పేర్లు వేయరు కదా? అలాగే ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా అని సరిపెట్టుకోక తప్పదు.