శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు?చెప్పాలని బిఆర్ఎస్ నేతలు పదేపదే సవాలు చేసేవారు. ఆ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డితో సహా ఉత్తమ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి ఇంకా పలువురు పోటీ పడ్డారు కనుక బిఆర్ఎస్ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు.
ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల తర్వాత మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని, మరో ఆరుగురుకి మంత్రి పదవులు లభించబోతున్నాయని, వాటి కోసం కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్లు పోటీ పడుతున్నారని వార్తలు వస్తున్నాయి.
రాష్ట్రంలో ముఖ్యమైన ఎన్నికలు పూర్తయిపోయాయి కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి బాధ్యతలను మరొకరికి అప్పగించి పరిపాలనపై దృష్టి కేంద్రీకరించాలనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
కనుక పిసిసి అధ్యక్ష పదవి కోసం కూడా పలువురు సీనియర్లు పోటీ పడుతున్నారని, కానీ రేవంత్ రెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ అధిష్టానం మంత్రి సీతక్కకు ఈ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇంతవరకు ‘సీతక్కకు పిసిసి అధ్యక్ష పదవి’ వార్తలపై కాంగ్రెస్ పార్టీలో ఎవరూ స్పందించలేదు. జూన్ 4 తర్వాత మంత్రి వర్గ విస్తరణ, పిసిసి అధ్యక్ష పదవిపై స్పష్ఠత రావచ్చు.