ఇటీవల విడుదలైన మళయాళ సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్’లో ‘గుణ’ సినిమా కోసం ఇళయరాజా స్వరపరిచిన ఓ పాటను వాడుకున్నందుకు సదరు దర్శక నిర్మాతలకు ఇళయరాజా లీగల్ నోటీస్ పంపారు. తన అనుమతి తీసుకోకుండా తాను స్వరపరిచిన ఆ పాటను సినిమాలో ఉపయోగించుకోవడం కాపీ రైట్ ఉల్లంఘనే అంటూ నోటీసులో పేర్కొన్నారు.
దానిపై మంజుమ్మల్ బాయ్స్ సినిమా నిర్మాత శాన్ ఆంటోనీ స్పందిస్తూ, “ఆ పాటకు కాపీ రైట్ కలిగిన రెండు మ్యూజిక్ కంపెనీల నుంచి మేము అనుమతి తీసుకునే మా సినిమాలో వాడుకున్నాము. కనుక మేము కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించలేదు,” అని స్పష్టం చేశారు. దీనిపై ఇళయరాజా ఇంకా స్పందించవలసి ఉంది.
సంగీత దర్శకుడుగా ఆయన అనేక వేల పాటలు స్వరపరిచారు. వాటిని దక్షిణాది రాష్ట్రాలలో అందరూ ఏదో సమయంలో వినియోగించుకుంటూనే ఉన్నారు. కానీ తాను స్వరపరిచిన ప్రతీ పాటపై తనకు హక్కు ఉంటుంది కనుక తన అనుమతి లేకుండా ఎవరూ వాడుకోరాదని ఇళయరాజా వాదిస్తుంటారు.
ఆయన స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఎన్నో పాటలను స్వరపరిచారు. ఓసారి విదేశాలలో జరిగిన సంగీత కార్యక్రమంలో ఇళయరాజా స్వరపరిచిన పాటలు పాడినందుకు బాలసుబ్రహ్మణ్యంకు కూడా లీగల్ నోటీస్ ఇచ్చారు. అప్పుడు అందరూ ఇళయరాజాను తప్పు పట్టారు.
ఆ తర్వాత బాలు మరెన్నడూ ఆయన స్వరపరిచిన పాటలు పాడలేదు. దాని వలన ఇళయరాజా ప్రతిష్టే మసకబారింది.
తన సంగీతంపై తనకు కాపీ రైట్ ఉందనుకున్నప్పుడు, ఆనాడు అన్నమాచార్య, రామదాసు తదితరులు వ్రాసి, స్వరపరిచి, పాడిన పాటలను ఇళయరాజా కూడా ఏదో ఓ సందర్భంలో వాడుకోకుండా ఉన్నారా? వాడుకుని ఉంటే ఆయన కూడా కాపీ రైట్ చట్టం ఉల్లంఘించిన్నట్లే కదా?
అయినా ఈ వయసులో ఇలా లీగల్ నోటీసులు పంపిస్తూ వాటితో ఆయన ఏమి సాధిస్తారో తెలీదు కానీ నలుగురిలో నవ్వుల పాలు అవుతుండటం చాలా బాధాకరమే.