బిఆర్ఎస్‌ చేస్తున్న తప్పే కాంగ్రెస్‌ కూడా?

May 23, 2024


img

శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీ ఓడిపోయిన తర్వాత, రాజకీయ పార్టీలకు ఎన్నికలలో గెలుపోటములు సహజమని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు పదేపదే చెప్పుకున్నారు. కనుక వారు తమ ఓటమిని హుందాగా స్వీకరించి, దానికి కారణాలను తెలుసుకొని సరిదిద్దుకుని ముందుకు సాగి ఉంటే ప్రజలు కూడా మళ్ళీ వారిని తప్పకుండా ఆదరించేవారు. 

కానీ రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన మర్నాటి నుంచే ఎన్నికల హామీల అమలు గురించి ప్రశ్నిస్తూ, ప్రభుత్వం కూలిపోతుందని లేదా కూల్చేస్తామన్నట్లు మాట్లాడుతుండటాన్ని ఎవరూ హర్షించలేరు. పదేళ్ళు అధికారం చలాయించి మరో 10-15 మేమే అధికారంలో ఉంటామని వారు ముగ్గురూ పగటి కలలు కన్నారు. కానీ అనూహ్యంగా ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోయారు. అందుకే ఇంత అసహనంగా ఉన్నారని సిఎం రేవంత్‌ రెడ్డి వాదన సహేతుకంగానే అనిపిస్తుంది. 

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావులు బెదిరించడం తప్పని ఎవరైనా అంగీకరిస్తారు. వారు చేస్తున్న తప్పునే కాంగ్రెస్‌ మంత్రులు కూడా చేస్తుండటం శోచనీయం. లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్‌ అనడం ఎంత తప్పో, బిఆర్ఎస్‌ పార్టీని లేకుండా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనడం కూడా అంతే తప్పు. 

బిఆర్ఎస్‌ వలన తమ ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉంది కనుక దానిని లేకుండా చేయాలని కాంగ్రెస్‌ అనుకోవడం సహజమే. కానీ ఈవిదంగా ఒకరి ప్రభుత్వాలను మరొకరు కూల్చుకుంటూ, ఒకరి పార్టీలను మరొకరు బలహీన పరిచి దెబ్బ తీసుకుంటూ రాజకీయాలు చేస్తుంటే చివరికి వాటిలో ఉన్నవారే నష్టపోతారు కదా?

ఎన్నికలలో గెలిచినవారు, ఓడినవారూ కూడా ప్రజాస్వామ్యానికి కట్టుబడి దానిని గౌరవించకుండా ఇలా ప్రవర్తిస్తుంటే చివరికి మిగిలేదు అరాచకమే అని గ్రహిస్తే మంచిది.


Related Post